బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు నలుగురు కార్పొరేటర్లు టచ్ లో ఉంటే, మాకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి బాంబు పేల్చారు. తమకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్‌లో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతు చూస్తామని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై తాము పోరాడుతుంటే.. బీజేపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్పొరేటర్లు తమకు టచ్ లో ఉన్నారంటూ మంత్రి కేటీఆర్ అంటున్నరు. కానీ, మాతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వారు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోందన్నారు. ధరణితో పేద ప్రజల జీవితాలను ఆగం చేశారుని వాపోయారు.
హిందువుల గురించి తాను బరాబర్ మాట్లాడుతానని, తన వల్లే కాంగ్రెస్, బీఆర్ఎస్,కమ్యూనిస్టు పార్టీలు భాగ్యలక్ష్మి దేవాలయం బాట పట్టాయని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందనీ, బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని సంజయ్ ప్రజలను కోరారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని, అవినీతిపరులను మోడీ సర్కార్ వీడిపెట్టదని హెచ్చరించారు. పార్టీలతో సంబంధం లేకుండా అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయమ న్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
