ధరణి పోర్టల్ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం కరీంనగర్‌లో మౌన దీక్షకు దిగారు. అనంతరం బండి సంజయ్ మీడియాలో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్‌లో ఎవరికి లాభమో కేసీఆర్ చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం కరీంనగర్‌లో మౌన దీక్షకు దిగారు. అనంతరం బండి సంజయ్ మీడియాలో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల భూములను కేసీఆర్ పేరు మీదకు మార్చుకునేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. లేని సమస్యలను తీసుకొచ్చి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు.
ధరణిలో 50 శాతం తప్పుల తడకేనని విమర్శించారు. ధరణి పోర్టల్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని అన్నారు. ధరణిని సరిదిద్దాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌కు రావకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనని విమర్శించారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, అగ్నిపథ్ పథకం, ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం కౌంటరిచ్చారు. దేవుళ్లను సీఎం కేసీఆర్ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని... రోజుకో హత్య, అత్యాచారం జరుగుతుంటే ఒక్కర్ని పట్టుకోవడం చేతకాదంటూ సంజయ్ చురకలు వేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
కర్ణాటక సీఎం వరదలు ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తున్నారని.. నువ్వు ప్రగతి భవన్ దాటుతున్నావా అంటూ కేసీఆర్‌పై ఆయన ధ్వజమెత్తారు. మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని.. నువ్వు ఫామ్ హౌస్ దాటి బయటికి రావంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ కు అహంకారం బాగా తలకెక్కిందని.. ఆయన దేశమంతా తిరిగి బ్రాందీలు, బ్రాండ్ల గురించి మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం గురించి కాదు.. నెట్టెంపాడు గురించి మాట్లాడాలని సంజయ్ చురకలు వేశారు.
