Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం జీవో 317 ను వెంటనే సవరించాలి.. టీచర్లు కూడా సాటి ఉద్యోగులేనని పోలీసులు గుర్తుంచుకోవాలి: బండి సంజయ్

తెలంగాణలో ప్రభుత్వ టీచర్లపై, వారి కుటుంబ సభ్యుల మీద జరిపిన దాడులను, అరెస్ట్‌లను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 

bandi Sanjay slams CM KCR Over Teachers Problems
Author
First Published Jan 23, 2023, 1:52 PM IST

తెలంగాణలో ప్రభుత్వ టీచర్లపై, వారి కుటుంబ సభ్యుల మీద జరిపిన దాడులను, అరెస్ట్‌లను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. టీచర్ల విషయంలో సీఎం కేసీఆర్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జీవో 317తో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని.. ఉద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. 34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకనున్నారని అన్నారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లపై సీఎం కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. 

టీచర్లకు నాలుగు డీఏలు బకాయి పెట్టారని.. జీతాలు, డీఏలు, పదోన్నతులు ఇవ్వడం లేదని విమర్శించారు. టీచర్ల బదిలీలో అక్రమాలు జరుగుతున్నాయని.. బీఆర్ఎస్ నేతలు పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. అనుకూలమైన వ్యక్తులు వారికి అనుకూలంగా ఉన్న చోట పోస్టింగ్ ఇస్తున్నారనీ.. అనుకూలం కానివారికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారని విమర్శించారు. జీవో 317పై టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాని డిమాండ్ చేశారు. 

ఉద్యోగులు జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కారణం లేకుండా 13 జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలను ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. పాఠశాలల్లో స్కావెంజర్లను తీసేశారని.. టీచర్లు బాత్‌రూమ్‌లు కడగాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్న‌ారు. టీచర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కూడా ఉద్యోగులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సాటి ఉద్యోగుల పట్ల పోలీసుల తీరు బాధాకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 ను వెంటనే సవరించాలని డిమండ్ చేశారు. జీవో 317పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios