తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై బండి సంజయ్ సీరియస్
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. వారినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బండి సంజయ్ ట్విట్టర్ వేదిక స్పందించారు.
ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బందిని బయటకు పంపించారు. ఆఫీస్ లోకి ఎవరిని అనుమతించలేదు. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం.. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన జరగడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న హాట్ టాపిక్‌గా మారింది.
తీన్మార్ మల్లన్న అరెస్టును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అదేసమయంలో తెలంగాణ విఠల్ అరెస్ట్‌ను కూడా తప్పుబట్టారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు.
‘‘తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని అనుకుంటున్నారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా ? ఖబడ్దార్ కేసీఆర్, వీరందరినీ బేషరతుగా విడుదల చేయాల్సిందే. జర్నలిస్ట్ విఠల్ ఆరోగ్యం బాగోలేదు, తనకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత వహించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా? కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి, కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడుదాం.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.