కేసీఆర్ ప్రజలనేంటి ఆ దేవున్నే మోసం చేయగలడు : బండి సంజయ్ సెటైర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలనే కాదు దేవుళ్లను కూడా మోసం చేస్తాడని బండి సంజయ్ ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనే కాదు చివరకు దేవుళ్లను కూడా మోసగిస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తన స్వార్థ రాజకీయాల కోసం ఇంకెనాళ్లు ఇలా మోసాలు చేస్తారని సీఎంను ప్రశ్నించారు. ఇంతకాలం గజ్వేల్ ప్రజలను మోసం చేసినట్లే ఇప్పుడు దేవుడి సొమ్ముతో కామారెడ్డి ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ సిద్దమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు.
గతంలో పాలమూరు ఎంపీగా పోటీచేసిన కేసీఆర్ అక్కడి ప్రజల ఓట్లకోసం ఆ జిల్లానే దత్తత తీసుకుంటానని మాయమాటలు చెప్పాడని సంజయ్ పేర్కొన్నారు. తీరా ఎంపీగా గెలిచాక ఏ హామీని నెరవేర్చకుండా పాలమూరు ప్రజలను మోసం చేసాడని అన్నారు. ఆ తర్వాత కరీంనగర్ లో పోటీచేసి అక్కడా ఇలాగే చేసాడన్నారు. కరీంనగర్ ను డల్లాస్, న్యూయర్క్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని మోసం చేసాడన్నారు.
ఇక తెలంగాణ ఏర్పాటుతర్వాత రెండుసార్లు గజ్వేల్ నుండి కేసీఆర్ పోటీ చేసారని అన్నారు. ఎన్నికల సమయంలో గజ్వేల్ ను నెంబర్ వన్ గా అభివృద్ది చేస్తానని హామీలిచ్చి మోసం చేసాడన్నారు. ఇప్పుడు ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యాడని సంజయ్ మండిపడ్డారు.
Read More ఇప్పటికే 100 సార్లు చెప్పా.. పార్టీ మారేది లేదు , త్వరలోనే బీజేపీ మేనిఫెస్టో : ఈటల రాజేందర్
కామారెడ్డి అభివృద్ది కోసమంటూ కేసీఆర్ భారీగా నిధులు కేటాయించాలని అనుకుంటున్నాడని... అయితే ఆ నిధులన్ని దేవుడి సొమ్మే అని సంజయ్ ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని ఇప్పటివరకకు ఒక్కపైసా ఇవ్వలేదని... ఇలా రూ.400 కోట్ల వరకు దేవుడికే శఠగోపం పెట్టాడన్నారు. అంతేకాదు ఇప్పుడు రాజన్నకు భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ డబ్బులను కామారెడ్డికి మళ్లించాలని అనుకుంటున్నారని... ఇది దుర్మార్గమని బండి సంజయ్ మండిపడ్డారు.
స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ప్రజలనే కాదు చివరికి సాక్షాత్తు దేవుళ్ళను కూడా మోసం చేస్తారని సంజయ్ అన్నారు. కామారెడ్డికి నిధులివ్వడం ఓకే... మరి మిగిలిని నియోజకవర్గాల ప్రజల ఏ పాపం చేసారు అని అన్నారు. దేవుడి సొమ్ము మళ్లించడం కాదు నిజంగానే చిత్తశుద్ది వుంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ సూచించారు.