అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది: ప్రవళిక ఆత్మహత్యపై బండి సంజయ్
హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవళిక అనే విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవళిక అనే విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు ప్రతిపక్షాలు నాయకులు కూడా ఘటన స్థలానికి చేరుకునినిరసన తెలిపారు. తాజాగా ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు.
అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ‘‘అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది. కానీ, నిరుద్యోగ యువతా....! ఆత్మహత్యలు వద్దు. ఆశ, ఆశయం, ఉరకలెత్తెన ఉత్సాహం, ఉరిమి తరిమిన మీ పౌరుషంతోనే తెలంగాణ సాకారం అయింది.అమరుల ఆకాంక్షల సారథులైన మీరు, ఒక్క కుటుంబం నిరంకుశత్వానికి నిరాశపడితే ఆత్మబలిదానాలు చేసిన అమరులను అవమానించడమే. నోటిఫికేషన్లు రాక, వచ్చినా వాయిదాలు పడుతూ, పేపర్ లీకులు, కోర్టు కేసులతో మీలో నిరాశ నిండుకుంటోందని తెలుసు.
కానీ, ఆ నిరాశ మీ సత్తువను కమ్మేయకూడదు. నిరంకుశత్వాన్ని నిగ్గుతేల్చే నిప్పు కణికలా ఎగిసిపడాలి. బీజేపీ మీ వెంటే ఉంటుంది. మీకోసం పోరాడుతుంది. మంచి రోజులు మన ముందే ఉన్నాయి. దొరల అరాచక పాలనను గద్దెదించి సత్తా చాటుదాం. మరొక్కసారి బరువైన గుండెతో కోరుతున్నా. ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదాం’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య, విజయ దంపతుల కూతురు ప్రవళిక. ఆమె హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతుంది. ప్రవళిక శుక్రవారం తన రూంలోనే ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ లెటర్ రాసి హాస్టల్‌లో ప్రవళిక బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ వార్త గురించి తెలుసుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చారు. పరీక్షల వాయిదా కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్దరాత్రి వరకు నిరసన కొనసాగించారు. ప్రవళిక కుటుబానికి న్యాయం చేయాలనిడిమాండ్ చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టమ్ అనంతరం ప్రవళిక మృతదేహాన్ని ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లాలోని బిక్కాజిపల్లిక తరలించారు. ప్రవళిక మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఇక,ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రవళిక రాసినట్టుగా చెబుతున్న సూసడ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని.. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడ్వకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పట్టకుండా చూసుకున్నారు. మీకునేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరు క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా. ప్రణీ అమ్మ నాన్న జాగ్రత్తా!’’ అని ఆ లేఖలో ఉంది.