మునుగోడు ఉపఎన్నిక .. ఈటలపై దాడి టీఆర్ఎస్ గూండాల పనే : బండి సంజయ్ విమర్శలు
మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై స్పందించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై స్పందించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. ఈటల చాలా సౌమ్యుడని, అతనిపైనే దాడి చేశారని బండి సంజయ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ గూండాలే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలన్న ఆయన.. తాను క్షమాపణలు చెప్పనని, మీరే చెప్పాలన్నారు. మీ ఆస్తులను మొత్తం బయట పెడుతానని ఆయన హెచ్చరించారు. టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే వుంటానని బండి సంజయ్ తేల్చిచెప్పారు. నలుగురు టీఎన్జీవో నేతలు ఒక్కసారైనా జీతాల గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. మీకు కోట్లాది రూపాయల ఆస్తులు వున్నాయని.. లోన్లు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడి తాను జైలుకెళ్లానని.. జైలుకెళ్లింది తామని, లాఠీ దెబ్బలు తిన్నది తామని ఆయన అన్నారు. మీ పీఆర్సీ కోసం మేం కొట్లాడామని బండి సంజయ్ గుర్తుచేశారు. స్కూళ్లలో కనీసం చాక్‌పీస్‌లు లేవని, ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. హెడ్ మాస్టర్లతో కేసీఆర్.. బాత్‌రూమ్‌లు కడిగించారని బండి సంజయ్ ఆరోపించారు. మీరు నలుగురు వెళ్లి కడగాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు పిలుపునిస్తే ధర్నాకు ఎంతమంది వచ్చారని ఆయన చురకలు వేశారు.
Also Read:క్షమాపణలు చెప్పేది లేదు, తిడుతూనే వుంటా : ‘‘ఆ నలుగురు’’ అంటూ టీఎన్జీవో నేతలపై సంజయ్ విమర్శలు
తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లబ్ధిపొందుతున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు సంజయ్. కులాల వారీగా ఎంతమందిని గణన చేశారో చెప్పాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ ఎంత వున్నాయో ఇక్కడ ఎంత వున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నలుగురు ఎమ్మెల్యేలను జంతువుల మాదిరిగా పట్టుకొచ్చి కేసీఆర్ సర్కస్ ఫీట్లు చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటర్లకు ముఖం చూపించలేకపోతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి మొనగాడి లాగా తిరుగుతున్నాడని ఆయన అన్నారు. కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మడం లేదని.. ఆర్టీసీని నాశనం చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అశ్వత్థామరెడ్డిని ఎన్నో ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దన్నారు.
కాగా.. ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం చివరి రోజు ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అయితే దీనికి వెంటనే స్పందించిన బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి. ఇరు పార్టీల శ్రేణులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. ఈ దాడిలో ఈటల కారు అద్దాలు ధ్వంసమవ్వగా.. ఆయన పీఆర్వో కాలికి గాయమైంది. అటు బీజేపీ కార్యకర్తల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీశ్‌కు గాయాలయ్యాయి.