తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లాలో నిర్వహించిన విద్యాదినోత్సవం కార్యక్రమంలో ప్రమాదవశాత్తు ఆరో తరగతి విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బిజెపి చీఫ్ బండి సంజయ్ స్పందించారు.  

హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని నిర్వహించిన బిఆర్ఎస్ ప్రభుత్వం. అయితే హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్పెల్లిగూడలో చేపట్టిన విద్యాదినోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీగా బయటకు వచ్చిన స్కూల్ విద్యార్థులను కుక్కలు వెంటపడటంతో తప్పించుకోబోయిన ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. 

ఆరో తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్ మృతిపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఓ చిన్నారి మృతికి కారణమవడం విషాదకరమని అన్నారు. 6వ తరగతి విద్యార్థి ధనుష్ దుర్మరణం దిగ్భ్రాంతికరమని... బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు. స్కూల్లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాల పేరిట బయటకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలని అన్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు. 

''ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాగంపై ఒత్తిడి తెస్తున్న ఈ సర్కార్ విద్యార్థులను సైతం బలవంత పెట్టడం దారుణం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి విగతజీవిగా మారడానికి కారణమెవరు? ఆ తల్లితండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? ఏం చెప్పి వారిని ఓదారుస్తారు..?'' అంటూ ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ నాయకులను నిలదీసారు బండి సంజయ్. 

Read More తన నాయకత్వంపై నేతల్లో అసమ్మతి, ఢిల్లీలో బండి సంజయ్ బిజి బిజీ .. పార్టీ పెద్దలతో మంతనాలు

''గతంలో ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని కొందరు మృతి చెందారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణలక్ష్మీ చెక్కు తీసుకునేందుకు వచ్చిన మరో వృద్ధురాలిని రోజంతా వెయిట్ చేయించి మృతికి కారణమయ్యారు.. ఇప్పుడు దశాబ్ధి ఉత్సవాల్లో 6వ తరగతి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా..?'' అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. 

అసలేం జరిగిందంటే :

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యాదినోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలోనే కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ తీశారు. ర్యాలీ తీస్తుండగా ధనుష్ పక్కనే ఉన్న కిరాణం దుకాణంలోకి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్లాడు. అయితే బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వస్తుండగా.. వీధి కుక్కలు వెంటపడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ధనుష్ అక్కడికక్కడే మృతి చెందాడు.