హోంగార్డ్ రవీందర్ ను కేసీఆర్ సర్కారే చంపేసింది...: బండి సంజయ్
హోంగార్డ్ రవీందర్ మృతిపై బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి విషాదం వ్యక్తం చేసారు. రవీందర్ ది ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ హత్యేనని సంజయ్ అన్నారు.

హైదరాబాద్ : హోంగార్డ్ రవీందర్ ను కేసీఆర్ ప్రభుత్వమే హత్య చేసిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ముమ్మాటికీ హోంగార్డ్ చావుకు బాధ్యత వహించాల్సింది కేసీఆర్ సర్కారే... పోలీసులు బిఆర్ఎస్ ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేసారు.
నిజాయితీగా పనిచేస తన భర్తను కొందరు పోలీసులు వేధించారని... చంపింది కూడా వారేనని హోంగార్డ్ రవీందర్ భార్య ఆరోపిస్తున్నారు. ఆమె అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై వుందన్నారు. కాబట్టి వెంటనే రవీందర్ ఘటన సమయంలోని గోషామహల్ కమాండెంట్ హోంగార్డు కార్యాలయం వద్ద ఏం జరిగిందో బయటపెట్టాలని అన్నారు. అక్కడ సిసి ఫుటేజీ బయటపెట్టాలని సంజయ్ కోరారు.
ఇక రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేసారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన రవీందర్ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సంజయ్ సూచించారు.
Read More సీఎం సారూ... మా కుటుంబాలను ఆదుకొండి..: మహిళా హోంగార్డు ఆవేదన
హోంగార్డ్ మరణం అత్యంత విషాదకరమని సంజయ్ అన్నారు. ప్రభుత్వం హోంగార్డులకు సకాలంలో జీతాలు ఇచ్చివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇకనైనా హోంగార్డులపై చిన్నచూపు చూడకుండా తగు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు బండి సంజయ్.
ఇక హోంగార్డ్ మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేసారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న కిషర్ రెడ్డి బాధలోవున్న అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.
హోంగార్డులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరుతో ఆందోళనకు గురయి హోంగార్డులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హోంగార్డులకు సూచించారు. ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదన్నారు. పోరాటం ద్వారా దక్కాల్సిన హక్కులను సాధించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.