సిద్దిపేట: అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితి దుబ్బాక ఉపఎన్నికల్లో భారీ నగదు పంపిణీకి సిద్దమయ్యిందని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులను కాదనకుండా తీసుకుని ఓటు మాత్రం బిజెపికే వెయ్యాలని దుబ్బాక ఓటర్లకు సూచించారు. 

గురువారం దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రఘునందన్ ను గెలిపించిన వారం రోజుల్లోనే  మల్లన్నసాగర్ నిర్వాసితులతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాడుతుందని సంజయ్ అన్నారు. 

దుబ్బాకలో బిజెపి గెలుపు ఖాయమని బలంగా నమ్ముతున్నామని... సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయన్నారు. రోజురోజుకు దుబ్బాక ప్రజల్లో బిజెపి పై ఆదరణ పెరుగుతోందని... ఇదే తమను గెలుపు తీరాలకు చేరుస్తుందన్నారు. దుబ్బాక గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు బిజెపి అధ్యక్షులు.