Asianet News TeluguAsianet News Telugu

నీ బిడ్డకు లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదని యాగంలో ప్రమాణం చేయి.. : కేసీఆర్‌కు బండి సవాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

bandi sanjay open challenge to kcr over delhi liquor scam
Author
First Published Dec 12, 2022, 11:59 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెంటిమెంట్‌తో కేసీఆర్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పేదలు అరిగోస పడుతున్నారని అన్నారు. పేదలను గోస పెడుతున్న కేసీఆర్ ఏ యాగం చేసినా ఫలించదని అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. అయితే కేసీఆర్ స్వార్దం కోసం యాగం చేస్తున్నాడని విమర్శించారు. 

కేసీఆర్ యాగం చేసేటప్పుడు ముందు మైక్ పెట్టుకుని.. తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారో, నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎంత మందికి రైతు రుణమాఫీ చేశారో, దళిత బంధు ఎంత మందికి ఇచ్చారో, ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారో, ఇప్పుడు రాష్ట్రలో ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేక పోవడానికి కారణమేమిటో, కాళేశ్వరంలో ఎంత కమీషన్లు తీసుకున్నారో వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్ చేసే యాగాలు ఆయనకే తిప్పికొడతాయని అన్నారు. 

తెలంగాణను అభివృద్ది చేయాలని మోదీ చూస్తున్న కేసీఆర్ సహకరించడం లేదని విమర్శించారు. ‘‘రాజశ్యామల యాగం సందర్భంగా లిక్కర్ స్కామ్‌తో నీ బిడ్డకు సంబంధం లేదని ప్రమాణం చేయి’’ అని కేసీఆర్‌కు సవాలు విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన బిడ్డకు సంబంధం లేదని కేసీఆర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రజలు బలికావాలా అని ప్రశ్నించారు.

కవితను సీబీఐ సాక్షి కోసం విచారణకు పిలిస్తే.. పులులు, సింహాల ఫొటోలు పెట్టి అంత హంగామా ఎందుకని ప్రశ్నించారు. బీజేపీని కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొలేకపోతున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌కు ఇంకా ఎక్కువ భయం పట్టుకుందని అన్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినంత మాత్రానా నేరం చేసినవారు బయటపడక తప్పదని అన్నారు. అవినీతి జరిగితే సీబీఐ దేశంలో ఎక్కడికైనా వెళ్లి విచారణ చేస్తుందన్నారు. నేరస్తులు కాకపోతే భయపడాల్సిన అవసరం లేదన్నారు. నేరం చేయకపోతే నిజాయితీని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. మోదీ వచ్చే ముందు ఈడీ రాదని.. కేసీఆర్‌కు కోవిడ్ వస్తుందని ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios