Bandi Sanjay Kumar: అంతా మన మంచికే.. కరీంనగర్ పార్లమెంటు సీటుపై ‘బండి’ ఫోకస్.. ప్లాన్ ఇదే
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఇక్కడి ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా గమనించడానికి బండి సంజయ్‌కు అవకాశం దొరికింది. ఆయన అసెంబ్లీ ఓటమిని పక్కనపెట్టి పార్లమెంటు సీటు గెలుచుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఓ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు.
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ అంతా మన మంచికే అనే మోడ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ అసెంబ్లీ సీటుపై పోటీ చేసి స్వల్ప మార్జిన్‌తో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ కరీంనగర్ లోక్ సభ సీటుపై ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని ఏడు మండలాల్లో ఓట్ల సరళి ఎలా ఉన్నది? ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతున్నారు? సంస్థాగతంగా బీజేపీ ఎంత బలంగా ఉన్నది? ప్రత్యర్థి పార్టీ ఏదీ? అనే అంశాలపై లోతుగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ద్వారా జనం నాడీ కొంత మేరకు పట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అంతా మనమంచికే.. అన్నట్టుగా ముందస్తుగా స్పష్టమైన అంచనాలతో లోక్ సభలో ఆయన పోటీకి దిగడానికి సులువైంది. దీనికితోడు ఆయనకు మరోసారి సెంటిమెంట్ కలిసొచ్చే అవకాశాాలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సింపథీ పెరిగింది. ఎంపీగా గెలిచేశారు. ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పక్కనపెట్టడం, ఇష్టం లేకున్నా కరీంనగర్ నుంచి బరిలోకి దింపడం, పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్ ఆధిపత్య పోరును ఎదుర్కోవడం వంటి అంశాలు బండి సంజయ్‌కు సానుకూలంగా పని చేసే అవకాశాలు ఉన్నాయి.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. మొత్తం 40 మండలాలు, 671 గ్రామాల్లో 16,51,534 ఓటర్లు ఉన్నారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్‌లు ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఇందులో కరీంనగర్‌లో బండి సంజయ్ మూడు వేల ఓట్ల తేడాతో గంగులపై ఓడిపోయి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ 17 వేల తేడాతో పాడి కౌశిక్ రెడ్డి పై ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారు. మిగిలిన ఐదు స్థానాల్లోనూ బీజేపీ మూడో స్థానానికే పరిమితం అయింది. చొప్పదండిలో 26 వేలు, వేములవాడలో 30 వేలు, సిరిసిల్లలో 18 వేల ఓట్లు, మానకొండూర్‌లో 14 వేలు, హుస్నాబాద్‌లో 8 వేల ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థులకు పోలయ్యాయి.
నిజానికి బండి సంజయ్ కుమార్‌కు ఎంపీగానే పోటీ చేయాలని ఉన్నది. కానీ, అధిష్టానం ఒత్తిడితోనే కరీంనగర్ స్థానంలో పోటీ చేసినట్టు తెలిసింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో అసెంబ్లీలో కూర్చోవడానికి బదులు.. పార్లమెంటులో అధికారపక్షంలో కూర్చోవడం మేలని తెలంగాణ బీజేపీ సీనియర్ల మైండ్‌లో మెదిలే అంశం. ఈ సారి బండి సంజయ్ పార్లమెంటుకు వెళ్లితే మంత్రి పదవి కూడా ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా కచ్చితంగా గెలువాల్సిందేనని శపథం బూనారు. ఇది ఒకరకంగా జీవన్మరణ సమస్య కూడా. అనతి కాలంలోనే రాష్ట్రస్థాయిలో పేరు సంపాదించి.. జాతీయ స్థాయికి ఎదిగిన బండి సంజయ్.. ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఒక దెబ్బ. అనుకోకుండా ఎంపీగానూ ఓడిపోతే ఆయనకు అది కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?
అందుకే శాసనసభ ఎన్నికలు ఆయనకు ప్రీఫైనల్‌గా పనికి వస్తాయని, అసెంబ్లీ ఎన్నికల డేటా కూడా అంచనాల కోసం ఉపకరిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వరకే ఆయన చేసిన పాదయాత్ర కూడా కలిసి వస్తుందని వివరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన సరళి పార్లమెంటు ఎన్నికల్లో ఉంటుందని, కేంద్రంలో అధికారంలో ఉన్నందున, మోడీ ఛరిష్మా ఇంకా చెక్కు చెదరకుండా ఉండటంతో బండి సంజయ్‌కు కరీంనగర్ అసెంబ్లీ కంటే కరీంనగర్ పార్లమెంటు సీటు గెలుచుకోవడం సులువు అని విశ్లేషిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో ఉండే ముదిరాజ్, ముస్లింల ఓట్లు, ఇతర ప్రత్యేక పరిస్థితులు బండి సంజయ్‌కు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కానీ, పార్లమెంటు స్థానాన్ని తీసుకుంటే మాత్రం ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువ అని చెబుతున్నారు.
Also Read: BC Bandhu: బీసీ బంధుకు తాత్కాలిక బ్రేక్.. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ఈ సానుకూల పవనాలకు తోడు బండి సంజయ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలపై ఆయన సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో పరిస్థితులను సమీక్షించనున్నారు. 45 రోజులపాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చలు, సమావేశాలు నిర్వహించడం, వారిని ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన నేరుగా జనంలోకి వెళ్లడానికి ప్లాన్లు వేసుకున్నట్టు తెలిసింది.