కరీంనగర్: సిద్ధిపేటలో పోలీసుల చర్యకు నిరసనగా దీక్ష చేస్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు షుగర్ లెవల్స్ తగ్గుతున్నట్లు సమాచారం అందుతోంది. ఆయన సోమవారం రాత్రి నుంచి కరీంనగర్ లోని బిజెపి పార్లమెంటు కార్యాలయంలో నిరశన దీక్ష చేస్తున్నారు.

సిద్ధిపేటలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ సీపీ జోయెల్ డెవిస్ ను సస్పెండు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై బిజెపి ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆయనను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు.

See Video: చిన్న పిల్లాడిలా నిస్పృహతో హరీష్ రావు: బాబూమోహన్.

బిజెపి నేతలు డికె అరుణ, బాబూమోహన్, మృత్యుంజయ, బొడిగె శోభ తదితరులు ఆయనను పరామర్శించారు. స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయనతో తెరిపి లేకుండా నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. బండి సంజయ్ దీక్షకు మద్దతుగా బిజెపి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. 

సోమవారం రాత్రి ఆయన దీక్షా స్థలిలోనే నిద్రించారు. జరిగిన సంఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి ఆరా తీశారు. బండి సంజయ్ మీద పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు.