Asianet News TeluguAsianet News Telugu

ఈటల, డికె అరుణ కంటే బండి సంజయ్ తోపు... అందుకే మోదీ 3.O లో చోటు..!!

బండి సంజయ్... సామాజ్య విద్యార్థి సంఘం నాయకుడి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగాడు. అయితే రాజకీయంగా సీనియర్లు, తోపులు తెలంగాణ నుండి ఎంపీలుగా గెలిచినా ఆయనకే   మోదీ కేబినెట్ లో ఎందుకు చోటు దక్కిందంటే... 

Bandi Sanjay gets Minister Post in Modi 3.O Cabinet AKP
Author
First Published Jun 14, 2024, 3:27 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ నే ఎదిరించిన నాయకుడు ఈటల రాజేందర్... ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని సొంత జిల్లాలో ఓడించిన నాయకురాలు డికె అరుణ. ఈ ఇద్దరూ తెలంగాణ నుండి బిజెపి ఎంపీలుగా గెలిచారు. రాజకీయంగానే కాదు ఆర్థికంగా బలమైన నాయకులు. వీరి సామాజిక వర్గాలు బలమైనమే. ఇద్దరికి ఇద్దరూ ఎలా చూసుకున్నా తోపులే. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికో కేంద్రమంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరికి కాదని ఓ సామాన్య కార్పోరేటర్ స్థాయి నుండి ఎంపీగా ఎదిగిన బండి సంజయ్ మోదీ 3.O లో చోటు దక్కింది.  

అయితే ఈటల రాజేందర్, డికె అరుణ కంటే బండి సంజయ్ ఎందులో తోపు... ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమేంటని కొందరు అంటున్నారు. ఇలాంటివారికి సంజయ్ అనుకూల వర్గం ధీటుగా జవాభిస్తోంది. గతంలోనూ సంజయ్ కి తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేసారని... ఆ తర్వాత ఆయన పనితీరు చూసి నోర్లు మూతపడ్డాయని అంటున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా సంజయ్ తనదైన మార్క్ చూపిస్తారని... తనకు అప్పగించిన హోంశాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తారని అంటున్నారు.  

బండి సంజయ్ ఏమీ లాబీయింగ్ చేసి కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోలేదని... ఆయనను బిజెపి పెద్దలే గుర్తించి తగిన గౌరవం ఇచ్చారని అనుచరులు, బిజెపి నేతలు అంటున్నారు. బిజెపి బలోపేతానికి  బండి సంజయ్ చేసిన కృషితో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ కలిసివచ్చిందని చెబుతున్నారు. ఇలా మోదీ కేబినెట్ లో సంజయ్ కి చోటుదక్కడానికి కారణాలు అనేకం వున్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్నింటిని పరిశీలిస్తే... 

1. ఆర్ఎస్ఎస్ నేపథ్యం : 

భారతీయ జనతా పార్టీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లో పనిచేసిన వారికి మంచి గుర్తింపు వుంటుంది. ఇతర పార్టీల నుండి ఎంతపెద్ద నాయకుడు చేరినా ముందునుండి బిజెపి అనుబంధ విభాగాలు, హిందుత్వ సంఘాల్లో  పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత వుంటుంది. ఇలా బండి సంజయ్ కూడా ఆర్ఎస్ఎస్, విద్యార్ధి విభాగం నుండి వచ్చిన నాయకుడు. పార్టీకోసం దశాబ్దాలుగా పనిచేయడమే ఆయనకు కేంద్ర మంత్రి దక్కడానికి ప్రధాన కారణం. మరో మంత్రి కిషన్ రెడ్డికి కూడా   రెండోసారి మోదీ కేబినెట్ లొ చోటుదక్కడానికి ఇదే కారణం. 

2. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా సక్సెస్ : 

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి బండి సంజయ్ కి దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆయనపై బిజెపి అదిష్టానం నమ్మకం వుంచింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన పదునైన వాగ్దాటితో, రాజకీయ చతురతతో బిజెపిని ఎప్పుడూ లేనంతగా బలోపేతం చేసాడు. అతడి అద్యక్షుడిగా వున్నపుడే దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అధ్భుత ఫలితాలు సాధించింది. ఓ దశలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందన్న వాతావరణం ఏర్పడింది. ఇలా సంజయ్ పనితీరు కూడా ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కడంలో మరో కారణం. 

3. సామాజిక సమీకరణలు :   

బండి సంజయ్ బిసి సామాజికవర్గానికి చెందినవాడు కావడం కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడానికి ఓ కారణం. ప్రస్తుతం బిసిలంతా బిజెపికి మద్దతుగా నిలుస్తున్నారు... కాబట్టి ఆ సామాజికవర్గ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువగా చోటు కల్పించారు. ఇలా బండి సంజయ్ కు మంత్రిపదవి దక్కడంలో బిసి కార్ట్ కూడా పనిచేసింది. 

4. ప్రధాని మోదీ అండదండలు :  

బండి సంజయ్ కు ప్రధాని నరేంద్ర మోదీ సపోర్ట్ బాగా వుందని... అమిత్ షా సపోర్ట్ మాత్రం ఈటల రాజేందర్ కు వుందనేది బిజెపి నేతలే చెబుతుంటారు. ఇలా మోదీ అండదండలతోనే సంజయ్ కు కేబినెట్ బెర్త్ దక్కింది. 

5. హిందుత్వ నేతగా గుర్తింపు : 

బండి సంజయ్ కు పక్కా హిందుత్వవాదిగా గుర్తింపు వుంది. ఆయన స్పీచ్ లన్నీ హిందుత్వ ఎజెండాతోనే సాగుతాయి. ఇలాంటి నాయకులనే బిజెపి కోరుకుంటుంది. ఇదే సమయంలో ప్రజల్లోనూ మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు సంజయ్. అతడిని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవినుండి తొలగించడం అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసిందనే ప్రచారం వుంది. కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఇవ్వడం ద్వారా అటు హిందుత్వ వాదులను, ఇటు తెలంగాణ ప్రజలను సంతృప్తి పర్చింది బిజెపి.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios