తమ కుమార్తెను బీజేపీ పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. ఢిల్లీలో చుట్టూ తిరిగినా కేసీఆర్‌నే రానివ్వలేదని, అలాంటిది కవితను చేర్చుకుంటామా అని ఆయన ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అదే పనిగా ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్‌నే తాము చేర్చుకోలేదన, కవితను ఎలా చేర్చుకుంటామని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి యుద్దం చేసినా తాము సిద్ధంగానే వున్నామని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు యుద్ధం ప్రారంభించామని, దీనిలో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కేసీఆర్‌లో భయం మొదలైందన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రులు ఇప్పటికే గుర్తించారని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. 

మరోవైపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈడీ దాడులను పార్టీ నేతలు ఉపేక్షించవద్దని సూచించారు. ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడే ధర్నాలు చేయాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికలకు పదిమాసాల సమయం ఉందని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.

ALso Read:‘‘ముందస్తు’’ లేదంటూనే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న కేసీఆర్ .. దీని వెనుకా వ్యూహామేనా..?

వచ్చే ఎన్నికలకు నేతలంతా సన్నద్దం కావాలని .. ప్రజలతో గ్యాప్ లేకుండా చూసుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం కోరారు. ప్రతి నిత్యం నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని కేసీఆర్ ఆదేశించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సీనియర్ నేతలను ఇంచార్జీగా నియమించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో చేసిన సోదాలకు సంబంధించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఆయా సంస్థలు తమ పనులు తాము చేసుకుంటూ పోతాయన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్రజాప్రతినిధులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు.