కరీంనగర్: దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట కమిషనర్ దౌర్జన్యం చేసి చేయి చేసుకొన్నారని... ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న దీక్ష రెండో రోజుకు చేరుకొంది.

సిద్దిపేటలోని బీజేపీ నేత రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాల విషయం గురించి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుండి ఆయనను కరీంనగర్ కు తరలించారు.

ఈ క్రమంలోనే తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. సీపీపై చర్య తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ లో ఆయన దీక్షకు దిగాడు.దుబ్బాకకు వెళ్లేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన పాస్ కూడ ఉందన్నారు. అయినా కూడ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.

also read:కరీంనగర్‌లో దీక్షకు దిగిన బండి సంజయ్: అమిత్ షా ఫోన్

కలెక్టర్ ను బదిలీ చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకొందన్నారు. పోలీస్ కమిషనర్ ను బదిలీ చేయలేకపోవడంపై మండిపడ్డారు.దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవకపోతే సస్పెండ్ చేస్తామని స్థానిక అధికారులను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

శాంతి భద్రతల సమస్యను సృష్టించి ఎన్నికను వాయిదా వేయాలని  టీఆర్ఎస్ కుట్ర పన్నారన్నారు.సిద్దిపేట సీపీ టీఆర్ఎస్ కండువా వేసుకొన్న కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.