ఖమ్మం నగరంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం పార్టీ తరపున కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించి పత్రాలను సాయిగణేష్ కుటుంబ సభ్యులకు అందించారు.
ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించారు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఖమ్మంలో సాయిగణేష్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అతని ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. సాయి గణేశ్ కుటుంబానికి బీజేపీ అండగా వుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ చెప్పారు. అలాగే పార్టీ తరపున కొనుగోలు చేసిన ఇంటి దస్తావేజులను సాయి గణేష్ కుటుంబ సభ్యులకు అందించారు.
కాగా... ఖమ్మంలో (khammam) బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (sai ganesh) .. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ (trs) నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ (bjp) నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (kcr) లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా భదాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్యులు కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి.. మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
