Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సర్కార్ పై జాతీయ మానవ హక్కుల కమీషన్ కు బండి సంజయ్ ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను ఆకలిబాధకు గురిచేస్తోందంటూ జాతీయ మానవ హక్కుల కమీషన్ కు రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ పిర్యాదు చేసారు. 

bandi sanjay complaints to national human rights commission  on  trs government
Author
Hyderabad, First Published Jun 26, 2022, 12:32 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందిస్తామంటూనే పాత రేషన్ కార్డులలో కోత విధిస్తోందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేదల రేషన్‌కార్డులను కూడా భారీగా రద్దు చేసిందన్నారు. అలాగే ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. వీటిపై జాతీయ మానవహక్కుల కమీషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేసారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులపై, కొత్తరేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని హ్యూమన్ రైట్స్ కమీషన్ ను బండి సంజయ్ కోరారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్నారు.  కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిషేదాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సిని సంజయ్ కోరారు. 

ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసిందని సంజయ్ పేర్కొన్నారు. అలాగే కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి రాష్ట్రంలో  ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. జూన్‌ 2021 నుంచి కొత్తరేషన్‌కార్డుల దరఖాస్తులను మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదన్నారు. ఇలా రేషన్ కార్డులు లేక నిరుపేదలు ఆకలిబాధతో అలమటించే పరిస్థితి వుంది కాబట్టి వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలివ్వాలని హెచ్చార్సీని కోరారు బండి సంజయ్. 

ఇదిలావుంటే ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరితే గౌరవెళ్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులపై విచక్షణరహితంగా పోలీసులతో ప్రభుత్వం  లాఠీచార్జీ చేయించిందని  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆరోపించారు. మహిళలు, యువతుల పట్ల పోలీసులు అసభ్యంగా వ్యవహరించారన్నారు.మహిళల పట్ల రాక్షసంగా వ్యవహరించి రాక్షసానందం పొందుతున్నాడని కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు. గౌరవెల్లి భూనిర్వాసితులతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీపై  బండి సంజయ్ పిర్యాదు చేశారు. 

12 ఏళ్లుగా గౌరవెల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు పోరాటం చేస్తున్నారన్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం 1.9 టీఎంసీలతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకొందన్నారు  ఆ తర్వాత  జరిగిన  కేసీఆర్ సర్కార్ ఈ రిజర్వాయర్ కెపాసిటీని 8 టీఎంసీలకు పెంచిందన్నారు. సుమారు 80 వేల ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు.

18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు రూ. 8 లక్షలు, వృద్దులకు కూడా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని  ఆయన గుర్తు చేశారు . నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లుు నిర్మిస్తామని కూడా కేసీఆర్  హామీ ఇచ్చారన్నారు. ఈ హామీలను పరిష్కరించాలని కోరితే పోలీసులతో లాఠీ చార్జీ చేయించారని బండి సంజయ్ విమర్శించారు. గౌరవెల్లి రిజర్వాయర్ లో నీళ్లకు బదులుగా భూ నిర్వాసితుల రక్తాన్ని పారిస్తున్నారని బిజెపి చీఫ్ బండి సంజయ్ విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios