Asianet News TeluguAsianet News Telugu

ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దమా?: కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో  చేర్పించుకన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్  బండి సంజయ్.

Bandi Sanjay Challenges To Telangana CM KCR
Author
Hyderabad, First Published Aug 11, 2022, 3:38 PM IST

రామన్నపేట: ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేర్పించుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ను కోరారు. ఈ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో నీ పార్టీ బలమెంతో మా పార్టీ బలమెంతో తేల్చుకొందాం  అంటూ బండి సంజయ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా  రామన్నపేటలో జరిగిన సభలో గురువారం నాడు  బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు నైతిక విలువలు ఉంటే టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్ముంటే ఉప ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన కోరారు. 

పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడంపైనా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోలియం ఉత్పత్తులపై  వ్యాట్ పేరుతో రూ. 30 దోచుకుంటుందని  టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

గురువారం నాడు ప్రజాయాత్రలో భాగంగా సిరిపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర రామన్నపేటలోకి ప్రవేశించింది. రామన్నపేటలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాల వేసి  నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మీరు రాముడి వారసులైతే బిజెపికి ఓటు వేయాలన్నారు. పాస్ పోర్టు ల  కేసులో  కేసీఆర్ జైలుకు వెళ్లాడని బండి సంజయ్ విమర్శించారు.  వయస్సు మీద పడడంతో కేసీఆర్ డిప్రెషన్ లో కి వెళ్లాడన్నారు.

పెట్రోల్ పై లీటర్ కు రూ.30 కమిషన్ తీసుకుంటున్నాడన్నారు. కర్ణాటక లో తెలంగాణ లో కంటే రూ. 13లు తక్కువగా దొరుకుతుందన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే డీజిల్ పోయించుకోవాలన్నారు.ధర్మారెడ్డి కాలువ పనులను పూర్తి చేయలేదన్నారు. రామన్నపేట లో పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి ఉందన్నారు. ఈ ఆసుపత్రిలో  డాక్టర్లు మాత్రం లేరన్నారు.. 

చంద్రబాబు తో కుమ్మక్కై కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేశాడని ఆరోపించారు.  కృష్ణా జలాల్లో తెలంగాణ కు హక్కుగా రావాల్సిన 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా  కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కొడుకు, కూతురు పాల్గొన్నారా? అని బండి సంజయ్ అడిగారు. మొబైల్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ పెట్టి బతుకమ్మ ఆడిన ఘనత కేసీఆర్ కూతురు కవిత దేనని ఆయన ఎద్దేవా చేశారు.

హరీష్ రావు కు పెట్రోల్ దొరుకుద్ధి కానీ, అగ్గిపెట్టె దొరకదన్నారు.నకిరేకల్ నియోజకవర్గంలో ఎంతమందికి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాడో చెప్పాలన్నారు. తెలంగాణకు మోడీ 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేశారన్నారు.

చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, లక్ష రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు, దళితబంధు హామీ ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది బీజేపీ యేనని ఆయన చెప్పారు. కేసీఆర్ వరి వేసి కోటీశ్వరుడైతే రైతులను బికారీలను చేశారని బండి సంజయ్ విమర్శించారు. 200 కి.మీల దూరంలో ఉన్న  తన ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేశాడన్నారు.

రామన్నపేట నియోజకవర్గంలో రూ. 700 కోట్లు ఖర్చు చేస్తే ధర్మారెడ్డిపల్లె, బునాదిగాని, పిలాయిపల్లి కాలువలు పూర్తవుతాయని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ని ఓడించేందుకు కాంగ్రెస్ తో కేసీఆర్ చేతులు కలిపాడన్నారు. రామన్నపేటలో రైళ్ల ను ఆపేవిధంగా కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. ఈ విషయమై రైల్వే జీఎం కు ఫోన్ చేసి మాట్లాడితే రైళ్లను ఆపేవిషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దరఖాస్తు చేశాడని చెప్పారు.

ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన సమయంలో కేసీఆర్  హామీలు ఇస్తాడన్నారు. ఆ తర్వాత ఆ హామీలను విస్మరిస్తాడని చెప్పారు.. బిజెపికి ఓట్లు వేయకున్నా కూడా కేంద్రం నుంచి నకిరేకల్ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో నిధులను మంజూరు చేశామన్నారు.కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో తాను చెబుతున్న లెక్కలు తప్పైతే తనపై కేసులు పెట్టుకోవాలని ఆయన కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios