నిరుద్యోగులకు వయోపరిమితి సడలిస్తాం: కరీంనగర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బండి సంజయ్

అధికార బీఆర్ఎస్ పై  విపక్షాలు విమర్శల దాడిని తీవ్రం చేశాయి.  కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి  బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ బరిలోకి దిగారు.  నిన్ననే  ఆయన  తన నామినేషన్ దాఖలు చేశారు.

Bandi sanjay begins  Election campaign in Karimnagar Assembly Segment lns

కరీంనగర్: తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే  నిరుద్యోగులకు వయోపరిమితిని సడలిస్తామని  కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బండి సంజయ్ హామీ ఇచ్చారు.కరీంనగర్ పట్టణంలోని 24, 25  డివిజన్లలో  బండి సంజయ్  మంగళవారంనాడు  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పాదయాత్రగా  ఇల్లిల్లూ తిరుగుతూ బండి సంజయ్ ఓటు వేయాలని  ప్రజలను కోరారు. పట్టణంలోని అంబేద్కర్  నగర్ లో బండి సంజయ్  మీడియాతో మాట్లాడారు.

టీఎస్‌పీఎస్‌సీ  నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం చిన్న సమస్యా అని ఆయన  ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  నిరుద్యోగుల ఆశలు  అడియాసలు చేసింది బీఆర్ఎస్ సర్కార్.   బీఆర్ఎస్  సర్కార్  నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగుల కోసం  పోరాటం చేసిన బీజేపీని మర్చిపోవద్దని కూడ ఆయన కోరారు. మీ కోసం లాఠీదెబ్బలు తిన్నాం,  జైలుకు వెళ్లిన విషయాన్ని  బండి సంజయ్ గుర్తు చేశారు. 

సీఎం కొడుకు అనే అహంకారంతో  కేటీఆర్  ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు.  మూడో దఫా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతే  జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. రెండు దఫాలు అధికారంలో ఉన్న సమయంలో  నిరుద్యోగులకు  ఉద్యోగాల కల్పనలో  ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 9 ఏళ్ల కాలంలో  మా కుటుంబ ఉద్యోగాలు చూసుకున్నాం.. ఇప్పుడు మీ ఉద్యోగాలు చూస్తామని  కేటీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.నిరుద్యోగులకు  న్యాయం జరగాలంటే  ఈ ఎన్నికల సమయంలో  స్పందించాలని ఆయన కోరారు.

 

మోడీ సర్కార్ రోజ్ గార్ మేళా పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. నిజాయితీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అందిస్తున్న విషయాన్ని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో  కనీసం  పోటీ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు. 

నిరుద్యోగుల కోసం ఏ కాంగ్రెస్ నేత కూడ జైలుకు వెళ్లలేదని  బండి సంజయ్  చెప్పారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.  కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు తిరిగి బీఆర్ఎస్ లో చేరుతారని ఆయన  విమర్శించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios