Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచమే మోదీని బాస్‌గా గుర్తించింది.. కేసీఆర్ ఇక్కడికి ఎందుకు రాలేదు?: బండి సంజయ్

ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలు వస్తాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 

Bandi sanjay and etela rajender comments in warangal bjp public meeting ksm
Author
First Published Jul 8, 2023, 3:05 PM IST | Last Updated Jul 8, 2023, 3:05 PM IST

ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలు వస్తాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఈరోజు వరంగల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రపంచమే బాస్‌గా గుర్తించిన  నేత నరేంద్ర మోదీ అని అన్నారు. ప్రపంచ దేశాలు ఆయనను గౌరవిస్తున్నాయని చెప్పారు. ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ అని తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన మహానుభావుడు మోదీ అని అన్నారు. తెలంగాణలో రూ. 6 వేల కోట్ల విలువ చేసే  అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని రాలేదని.. ఇక్కడుకు రావడానికి కేసీఆర్ ముఖం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ది మీద ధ్యాస ఉంటే.. ఇక్కడకు వచ్చి అడిగేవాడని అన్నారు. 


‘‘బీజేపీ జెండా మోసిన భుజం అన్నా ఇదీ.. ఒక్కసారి మోదీని దగ్గర నుంచి చూడాలని, మోదీ నోటి వెంట సంజయ్ అనే పేరు రావాలని కల కన్నాను.. నా కల  నెరవేరింది. నాకు రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు అప్పగించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఎన్నటికీ మర్చిపోలేను’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని అన్నారు.  ఈ జన్మకు తనకు ఇది చాలని ఈ సందర్భంగా బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. 


అభివృద్ధి ప్రాజెక్టులతో వందల సంఖ్యల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మోదీ తెలంగాణకు వచ్చారని ఆయన అన్నారు. 'జై మోదీ' నినాదంతో కేసీఆర్​ చెవుల్లోంచి రక్తం రావాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొడతామని.. మోదీ రాజ్యం, రామరాజ్యం తీసుకోస్తామని చెప్పారు. 

ఇదే వేదికపై నుంచి బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈరోజు ఉత్తర తెలంగాణకు శుభసూచికమని అన్నారు. వరంగల్ గడ్డ మీద రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే మోదీ తెలంగాణకు వచ్చారని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలని తెలంగాణ  ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ తన హామీలతో తెలంగాణ  ప్రజల కళ్లలో మట్టికొట్టారని విమర్శించారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ మాయమాటలు చెప్పారని విమర్శలు గుప్పించారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేతల్లో చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. కొందరు కావాలనే కుట్రపూరిత కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios