POCSO : బండి భగీరథ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మగవాళ్ళ హక్కుల కోసం పోరాడే ఓ ఎన్జీవో ఈ వ్యవహారంలో కీలక ప్రకటన చేసింది… ఆసక్తికరమైన ఐదు ప్రశ్నలను సంధించింది. అవేంటో ఇక్కడ చూద్దాం.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో భగీరథ్ పై POCSO (ఫోక్సో) కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో పురుషుల హక్కుల కోసం పోరాడే ''పురుష్ ఆయోజ్'' NGO భగీరథ్ వ్యవహారంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. రాజకీయాల కోసం ఈ వ్యవహారాన్ని వాడుకోకూడదని... నిస్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుతూ ఈ ఎన్జీవో ప్రకటన విడుదల చేసింది.

మహిళలు, పిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను రాజకీయ కక్ష సాధింపులకు, ఆర్థిక దోపిడీ, వ్యక్తిగత ప్రతీకారాల కోసం దుర్వినియోగం చేయకూడదని పురుష్ ఆయోగ్ ఎన్జీవో పేర్కొంది. నిజమైన బాధితులకు న్యాయం జరగాలి... అదే సమయంలో దురుద్దేశపూర్వక ప్రాసిక్యూషన్లు, మీడియా ట్రయల్స్ నుండి అమాయక వ్యక్తులను, కుటుంబాలను రక్షించాలని ఈ NGO కోరుతోంది. బండి భగీరథ్ వ్యవహారంలో ఇదే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలను సంధించింది పురుష్ ఆయోగ్.
1. రాజకీయ కక్ష సాధింపు
కుమారుడిపై వచ్చిన ఆరోపణలకు తండ్రిని ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రశ్నించడాన్ని పురుష్ ఎన్జీవో గుర్తుచేసింది. ఇలా బండి భగీరథ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను లాగడాన్ని ఈ ఎన్జీవో తప్పుబట్టింది. కేంద్ర మంత్రికి ఎలాంటి ప్రత్యక్ష పాత్ర లేదని స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరించినప్పటికీ ఈ వివాదంలోకి ఆయనను లాగుతున్నారు... ఇది రాజకీయ కక్ష సాధింపే అని ఆందోళన వ్యక్తం చేసింది. బండి సంజయ్ ని కావాలేనే టార్గెట్ చేశారని అర్థమవుతోందని పురుష్ ఎన్జీవో పేర్కొంది.
2. కన్సెంట్, యువతి వయసుపై నిస్పక్షపాత విచారణ...
తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ వ్యవహారంపై కీలక వాదనలు జరిగాయి. ఈ సమయంలో కన్సెంట్, అమ్మాయి వయసుపై చర్చ జరిగింది... ఈ అంశాలే కీలకమని డిఫెన్స్ కౌన్సిల్ వాదించింది. ఎందుకంటే అమ్మాయి వయసులో స్వల్ప వ్యత్యాసం ఉన్నా పోక్సో (POCSO) కేసు చట్టపరమైన స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది. అందుకే వయసు నిర్ధారణకు సంబంధించిన పత్రాలను ధృవీకరించాలని స్వయంగా కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఏ వ్యక్తిపైనైనా బహిరంగంగా నేరస్తుడనే ముద్ర వేయడానికి ముందు ఈ వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలించాలని పురుష్ ఆయోగ్ ఎన్జీవో సూచించింది.
3. వసూళ్ల (Extortion) ఆరోపణలపై విచారణ జరగాలి
కోర్టులో వాదనలు, మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం... భగీరథ్ వ్యవహారంలో భారీగా డబ్బులు లాగేందుకు ప్రయత్నం జరిగినట్లు అర్థమవుతోందని పురుష్ ఆయోగ్ ఎన్జీవో పేర్కొంది. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే రూ.5 కోట్లు డిమాండ్ చేశారని భగీరథ్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను విస్మరించలేం... దీనిపై నిస్పక్షపాత విచారణ జరగాలని కోరింది. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతోనే క్రిమినల్ చట్టాలను ఉపయోగించిన ఒత్తిడి తెస్తున్నారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఎన్జీవో సూచిస్తోంది.
4. హైకోర్టు విచారణలో లోతైన పరిశీలన అవసరం
ఇటీవల భగీరథ్ కేసులో విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ టి. మాధవి దేవి మాట్లాడుతూ... ఈ విషయంలో లోతైన విషయాలు, చట్టపరమైన వాదనలు ఉన్నాయని పేర్కొన్నట్లు పురుష్ ఆయోగ్ ఎన్జీవో గుర్తుచేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆదేశాలను కోర్టు రిజర్వ్ చేసింది. బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఈ దశలో రక్షణ కల్పించడానికి తాను మొగ్గు చూపడం లేదని న్యాయమూర్తి పేర్కొంటూనే, కోర్టు ముందు ఉన్న సమగ్ర సమాచారాన్ని కూడా గుర్తించారని ఎన్జీవో తెలిపింది.
5. మీడియా ట్రయల్ వద్దు
ఏ కోర్టు కూడా దోషిగా నిర్ధారించక ముందే ఒక యువకుడి ప్రతిష్ఠను టెలివిజన్ చర్చలు, డిజిటల్ మీడియా, సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో బహిరంగంగా దెబ్బతీస్తున్నారని పురుష్ ఆయోజ్ ఎన్జీవో ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా "నేరం రుజువు అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అమాయకులే" అనే రాజ్యాంగ సూత్రం అందరికీ వర్తించాలని ఎన్జీవో స్పష్టం చేసింది.
పురుష ఆయోగ్ NGO ప్రెసిడెంట్ బర్ఖా ట్రెహాన్ ఆసక్తికర కామెంట్స్..
"పోక్సో వంటి కఠినమైన చట్టాలు అమాయక పిల్లలను, నిజమైన బాధితులను రక్షించడానికి రూపొందించబడ్డాయి. అంతేగానీ అవి రాజకీయ కక్ష సాధింపులకు, వసూళ్లకు లేదా మీడియా సంచలనాలకు సాధనాలుగా మారకూడదు. కన్సెంట్, వయస్సు నిర్ధారణ లేదా వసూళ్ల ఆరోపణలపై విభేదాలు ఉన్నప్పుడు... ఒకరి జీవితాన్ని, ప్రతిష్ఠను నాశనం చేయడానికి ముందే ఆ వాస్తవాలను క్షుణ్ణంగా విచారించాలి. న్యాయం అనేది సాక్ష్యాధారాల ఆధారంగా, నిష్పక్షపాతంగా, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉండాలి." అని పురుష ఆయోగ్ NGO ప్రెసిడెంట్ బర్ఖా ట్రెహాన్ తెలిపారు.


