సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాాగుతోంది.  ఈ నేపథ్యంలో బిజెపి నుండి ముషీరాబాద్ ఎమ్మెల్యేగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమె క్లారీటీ ఇచ్చారు. 

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా స్పీడ్ పెంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మునిగిపోయాయి. ఈ క్రమంలో హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూతూరు విజయలక్ష్మి బిజెపి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ముషీరాబాద్ నియోజకర్గం నుండి ఆమె పోటీకి సిద్దమవుతునన్న రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బండారు విజయలక్ష్మి తన రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 

సాక్షి సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ లో పోటీ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గానీ... టికెట్ ఇవ్వాలని గానీ ఎవరినీ అడగలేదని ఆమె స్పష్టం చేసారు. ఒకవేళ తనకు పార్టీ అవకాశం ఇస్తేమాత్రం తప్పకుండా పోటీచేస్తానని అన్నారు. కానీ పార్టీ లైన్ ను దాటి రాజకీయాలు చేయబోనని... ఇలాంటివి బిజెపి సిద్దాంతాలకు వ్యతిరేకమని విజయలక్ష్మి అన్నారు. 

ముషిరాబాద్ నుండి పోటీ చేయాలని బిజెపి అదిష్టానం నిర్ణయిస్తే... నాయకులు, కార్యకర్తలు కోరుకుంటే తప్పకుండా బరిలోకి దిగుతానని విజయలక్ష్మి అన్నారు. తన సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలో బిజెపి పెద్దలకు తెలుసని... వారిని కాదని తాను ముందుకు వెళ్లబోనని అన్నారు.  ఇప్పటికయితే తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని విజయలక్ష్మి అన్నారు. 

Read More  ఈ నెల 16, 17 తేదీల్లో హైద్రాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ: ఈ నెల 18న బీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్

సామాజిక కార్యక్రమాలతో పాటు బిజెపి నాయకురాలిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని... అందువల్ల తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. బిజెపి కార్యకర్తగా గుర్తించబడటం తనకు చాలా ఇష్టమన్నారు. బిజెపి సిద్దాంతాలు నచ్చే పార్టీ లైన్ లో పనిచేస్తున్నానని... ఇకపై ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని స్వీకరిస్తానని అన్నారు. పదవుల కోసం కాకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తానని విజయలక్ష్మి తెలిపారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తండ్రి బండారు దత్తాత్రేయ బాటలోనే నడుస్తానని... నైతిక విలువలు, క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తానని విజయలక్ష్మి అన్నారు. పుట్టింటితో పాటు అత్తింటివారు కూడా రాజకీయాల్లో వున్నారు... కాబట్టి తనకు రాజకీయాలంటే ఆసక్తి వుందన్నారు. అందువల్లే జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు బిజెపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని అన్నారు. పార్టీ అదిష్టానమే రానున్న ఎన్నికల్లో తాను పోటీచేసేది లేనిది నిర్ణయిస్తుందని... దానికి తాను కట్టుబడి వుంటానని విజయలక్ష్మి తెలిపారు.