తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే పోలింగ్ తేదీకి ఓట్ల లెక్కింపునకు మధ్య చాలా రోజులు సమయం పట్టింది.

దీంతో బ్యాలెట్ పత్రాలు ఎక్కువ రోజులు స్ట్రాంగ్ రూమ్‌లోనే ఉంచాల్సి వచ్చింది. దీంతో బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి ఎంపీటీసీ పరిధిలోని 44, 105, సూరారం పరిధిలోని 39, 116 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టింది.

లెక్కింపునకు వీలుకాకపోవడంతో కౌంటింగ్ సిబ్బంది తలలు పట్టుకున్నారు. చెదలు పట్టిన బ్యాలెట్ పత్రాల సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దీంతో ఆయన అంబటిపల్లి, సూరారం ఎంపీటీసీ స్థానాల్లో, మహాదేవ్‌పూర్ జడ్పీటీసీ స్ధానంలో ఫలితాలను నిలిపివేయనున్నట్లు సమాచారం.