ఎన్నికల్లో తనకు నియమించిన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ తహసీల్దార్ సస్పెన్షన్ కు గురయ్యారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైనీ సదరు అధికారికి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 

నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మావోయిస్టు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గార్ల మండల తహశీల్దార్ కృష్ణ ఎన్నికల విధులు నిర్వహించారు. అయితే ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తనకు కేటాయించిన  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఈసీ అధికారులు గుర్తించారు. 

ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. దీనిపై విచారణ జరిపించిన కలెక్టర్ రజత్ కుమార్ తహశీల్దార్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.