వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి తన కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.  ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  సనత్ నగర్ డివిజన్, బీకేగూడకు చెందిన చంద్రశేఖర్, పావని దంపతులకు అక్షర అనే కుమార్తె ఉంది. గత నెల 13వ తేదీన చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా... ఆమె కాలిపై కప్ బోర్డు పడింది. దీంతో... తీవ్రంగా గాయపడింది.

వెంటనే చిన్నారిని తల్లిదండ్రులు దగ్గరలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు.  వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి ఆరోజు సాయంత్రం డిశ్చార్జి చేశారు. మరుసటి రోజు ఉదయం కాలు నీలిరంగుగా మారడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కాలు తొలగించాలని చెప్పారు. 

అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు కాలు తొలగించకపోతే పాప ప్రాణాలకే ముప్పని చెప్పడంతో వారు అంగీకరించడంతో కాలు తొలగించారు. 18వ తేదీన చిన్నారిని డిశ్చార్జి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కాలు పోయిందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాలిక తల్లిదండ్రులు 25వ తేదీన సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయం చేయాలని వారు కోరారు.