సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై బిజెపి ఆందోల్ అభ్యర్థి, సినీ నటుడు బాబూ మోహన్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పిట్ట కథలు, కట్టు కథలు , సూది కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. 

సూది కథలు చెప్పి తండ్రీకొడుకులు తమను అవమానిస్తున్నారని ఇటీవల తనను కలిసిన దర్జీలు బాధపడ్డారని ఆయన అన్నారు. సంగారెడ్డిలో జరిగిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో చేసిన అవినీతి ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తుందని బాబూ మోహన్ అన్నారు. ఒక్కో అభ్యర్థికి కేసీఆర్ ఆ అవినీతి సొమ్ము నుంచే యాభై కోట్ల చొప్పున ఇస్తున్నారని ఆరోపించారు.
 
విచ్చలవడిగా లారీల్లో మద్యం దిగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు.  తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన కేసీఆర్ ఇంత విచ్చలవిడిగా డబ్బులు పంచుతారా అని అడిగారు. కేసీఆర్ డబ్బులు పంచి ఓట్లు అడగడం ఇది తెలంగాణ ఓటర్లను అవమానించడమేనని అన్నారు. 

ముడుపుల ద్వారా వచ్చిన ఈ డబ్బును మంచి పనికి వాడాలని కేసీఆర్‌కు ఉచిత సలహా ఇచ్చారని ఆయన అన్నారు. ఓట్ల కోసం ఇన్ని కోట్లు పంచుతారా అని అడిగారు. అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలుసునని ఆయన విమర్శించారు.

టీడీపీ అంటే తనకు గౌరవం ఉండేది కానీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తనకు నచ్చలేదని బాబూ మోహన్ అన్నారు. సంగారెడ్డిలో బాబూమోహన్‌కు ఓయూ జేఏసీ విద్యార్థులు మద్ధతు పలికారు. ఎన్నికల్లో బాబు మోహన్‌ తరపున ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 

కొడుకు, కూతురు కోసం సింగూర్‌ని కేసీఆర్‌ ఖాళీ చేశారని ఆయన ఆరోపించారు.  క్రాంతి కిరణ్‌ అనే దళారికి టికెట్‌ ఇచ్చి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పుట్టి అక్కడే చదివి అక్కడే ఉండే వ్యక్తి ఆంథోల్‌లో లోకల్‌ ఎలా అవుతారని ఆయన అన్నారు. 

కేసీఆర్‌ని తిట్టరాని తిట్లు తిట్టిన వారికి మంత్రి పదవులిచ్చారని, మళ్లీ వాళ్లకే టికెట్‌ ఇచ్చారని, మరి తాను ఏం అపరాధం చేశానని ఆయన అన్నారు.