ఇంద్రలో అచ్చం బ్రహ్మానందం లాగే..: బంగారం మూటగట్టి...

Baba cheats public like Brahmanandam in Indra film
Highlights

ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం మాదిరిగానే ఓ దొంగ బాబా మోసాలకు ఒడిగట్టాడు. బంగారం నగలను మూట గట్టి నదిలో ముంచితే రెట్టింపు అవుతాయని నమ్మించి, మోసం చేసే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది.

హైదరాబాద్‌: ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం మాదిరిగానే ఓ దొంగ బాబా మోసాలకు ఒడిగట్టాడు. బంగారం నగలను మూట గట్టి నదిలో ముంచితే రెట్టింపు అవుతాయని నమ్మించి, మోసం చేసే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. 

ఆ రకంగానే హైదరాబాద్‌లో ఓ దొంగ బాబా తనను ఆశ్రయించిన భక్తులను కోటిశ్వరులను చేస్తానని మాత్రమే కాకుండా ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తారనని చెప్తాడు. నమ్మిన భక్తుల ఇళ్లకు వచ్చి పూజలు, యాగాలు జరిపిస్తాడు. కుటుంబ సభ్యులందరూ పూజలో కూర్చోవాలంటాడు. 

మంత్రాలు పఠిస్తూ.. ఇంట్లో ఉన్న బంగారు నగలన్నీ ఓ చెంబులో వేసి పూజలో పెట్టాలని సూచిస్తాడు. పూజ చేస్తూ, అందరూ కళ్లు మూసుకొని దేవుడిని ప్రార్థించాలని చెబుతాడు. అక్కడ తన చేతివాటం ప్రదర్శిస్తాడు. నగల చెంబును గుట్టుగా తన పక్కన ఉన్న భార్యకిచ్చేస్తాడు. అదే మాదిరి మరో చెంబును పూజలో పెడతాడు. 

చెంబుకు ఉన్న మూతను వెంటనే తెరవకూడదని హెచ్చరించేవాడు. 60 రోజుల పాటు చెంబును పూజగదిలో పెట్టాలని చెప్పేవాడు. తర్వాత తానే వచ్చి చెంబు మూత తీసి రెట్టింపైన బంగారాన్ని చేతిలో పెడతానని చెప్పేవాడు. తర్వాత దక్షిణను పుచ్చుకొని, నగలున్న చెంబుతో దర్జాగా వెళ్లేవాడు. 
శివోహం రామ శివానుజం తన మాయాజాలంతో 11మందిని మోసం చేశాడు. వారి నుంచి రెండు కిలోల దాకా బంగారాన్ని కాజేశాడు. దక్షిణ పేరుతో లక్షల్లో నగదు తీసుకున్నాడు. మొత్తంగా కోటికిపైగా సొత్తు అతడు దోచుకున్నట్లు గుర్తించారు. బాధితుల్లో రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి దంపతులు ఉన్నారు. దొంగబాబా నుంచి 1.922 కిలోల ఆభరణాలను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చివరకు ఈ దొంగబాబా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఆ దొంగ బాబా శివోహం రామ శివానుజం అలియాస్‌ రామ శివ చైతన్యం స్వామీజీ, అతడి భార్య తేజస్వినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

శుక్రవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ కేసు వివరాలను వెల్లడించారు. శివోహం రామ శివానుజం స్వస్థలం కేరళలోని కలాడి. తనను తాను తత్వవేదం పీఠాధిపతిగా చెప్పుకుంటూ వచ్చాడు. కొన్నాళ్లు కలాడి తిరుచూరులో ఉన్న శివోహం జ్ఞానగురుపీఠంలో ఉన్నాడు. 1998లో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. 

ఆ తర్వాత తన సికింద్రాబాదులోని బోయిన్ పల్లికి చేరుకున్నాడు. 2009లో హైదరాబాద్‌ బోయిన్‌పల్లికి చెందిన తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కొద్దిరోజులకు యూస్‌ఫగూడ కృష్ణకాంత్‌ పార్కు సమీపంలో ఇల్లును అద్దెకు తీసుకొని తత్వపీఠం అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. 

భక్తి కార్యక్రమాల కోసం కొన్ని టీవీ చానళ్లు శివోహం రామ శివానుజాన్ని ఆహ్వానించేవి. పూజలకు లక్షల్లో ఖర్చవుతుందని నమ్మించి దక్షిణ రూపంలో భారీగా పిండుకునేవాడు. ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూలు చేస్తూ వచ్చాడు.

loader