ప్రాణం కంటే పరువే ముఖ్యం.. అందుకే: అవంతి తండ్రి లక్ష్మారెడ్డి
హేమంత్ హత్య కేసులో నిందితుల తొలి రోజు కస్టడీ ముగిసింది. విచారణలో భాగంగా హేమంత్ హత్యకు దారి తీసిన కారణాలను నిందితులు వెల్లడించారు
హేమంత్ హత్య కేసులో నిందితుల తొలి రోజు కస్టడీ ముగిసింది. విచారణలో భాగంగా హేమంత్ హత్యకు దారి తీసిన కారణాలను నిందితులు వెల్లడించారు. అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని ఆమె తండ్రి లక్ష్మారెడ్డి తెలిపారు.
తమ నుంచి తప్పించుకుని అవంతి .. హేమంత్‌ను ప్రేమ పెళ్లి చేసుకుందని ఆయన తెలిపారు. ప్రేమ పెళ్లి చేసుకున్నారని పోలీసులు సమాచారం ఇచ్చారని.. గత 15 ఏళ్లుగా బావమరిది యుగంధర్‌తో మాటలు లేవని లక్ష్మారెడ్డి చెప్పారు.
హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ప్రాణం కంటే పరువు ముఖ్యమని భావించే కుటుంబం మాదని.. తాము నివసిస్తున్న కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యమని లక్ష్మారెడ్డి తెలిపారు.
అవంతి ప్రేమ పెళ్లితో తల దించుకోవాల్సి వచ్చిందని... హేమంత్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని ఆరు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లి, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.
ఇప్పటికే హేమంత్ హత్య కేసులో 21 మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇప్పటికే అవంతి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు. హేమంత్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో రోజుకోక కొత్త విషయం తెలుస్తోంది.
అతనిని హత్య చేసేందుకు అవంతి తల్లిదండ్రులు, బంధువులు రెండు ముఠాలను కలిసినట్లుగా తెలుస్తోంది. ఒక ముఠా హ్యాండివ్వడంతో మరో ముఠాను సంప్రదించి హేమంత్‌ను హతమార్చారు.
ఈ ఏడాది జూన్ 10న అవంతి, హేమంత్ పెళ్లి చేసుకున్నాకా.. కూతురిని తమవైపుకు తిప్పుకునేందుకు తల్లిదండ్రులు రెండు నెలలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత హేమంత్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా దంపతులను విడదీయాలని భావించారు.
యుగంధర్ రెడ్డి ఓ గ్యాంగ్ సభ్యులను సంప్రదించి పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకు సంబంధించి ముందుగా లక్ష రూపాయలు, తర్వాత మిగిలినది ఇస్తానని చెప్పాడు. దీనిలో భాగంగా పరిస్ధితులు అనుకూలంగా ఉన్నప్పుడు సమాచారం ఇస్తే కిడ్నాప్ చేద్దామంటూ ఆ వ్యక్తి చెప్పాడు.
రెండు మూడు సార్లు రెక్కీ నిర్వహించి ఫోన్ చేసినా ఇప్పుడొద్దులే అంటూ ఆ వ్యక్తి వాయిదా వేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో బిచ్చూ యాదవ్ ముఠాతో ఒప్పందం చేసుకుని హత్య చేయించాడు యుగంధర్ రెడ్డి.