హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగిన ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా యువతకు ఉద్యోగాలు లేవని, తనలాంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడంలేదంటూ నిరసన దిగిన ఆటోడ్రైవర్ తనవెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడే వున్న పోలీసులు అలెర్ట్ అయి అతన్ని అడ్డుకుని కాపాడారు. 

ఇలా ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని చందర్ గా గుర్తించారు. అతడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎదుట కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే తాజాగా అతడు మరోసారి డబుల్ బెడ్రూం, ఉద్యోగాల కోసం బలవన్మరణాని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆటోడ్రైవర్ చందర్ పోలీసుల అదుపులో వున్నాడు. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెడతామని పోలీసులు తెలిపారు. అలాగే ప్రగతిభవన్ వద్ద తరచూ ఆందోళనకర వాతావరణ ఏర్పడుతుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయినప్పటికి శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.