వికటించిన ఆపరేషన్ ఆకర్ష్ : బేరసారాలు జరిపింది ఈ ఎమ్మెల్యేలతోనే... పోలీసులకు దొరికిపోయారిలా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఎవరెవరితో వీరు బేరసారాలు జరిపారన్న సమాచారంపై ఉత్కంఠ నెలకొంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేయగా నలుగురు వ్యక్తులు దొరికిపోయారు. అయితే అసలు ఇంతకీ పట్టుబడిన వ్యక్తులు బేరసారాలు జరిపింది ఎవరితోనన్న ఆసక్తి నెలకొంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలను వీరు ప్రలోభ పెట్టారు. రెండ్రోజులుగా రకరకాల మార్గాల్లో ఎమ్మెల్యేలతో వీరు సంప్రదింపులు జరుపుతున్నారు.
పార్టీ మారితే.. రూ.100 కోట్ల డబ్బు, వందల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు, కీలక పదవులు కట్టబెడతామనే హామీ ఇచ్చినట్లుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో నలుగురు వ్యక్తులు ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరితో పాటు రూ.కోట్లాది నగదు వున్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని .. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు..? ఇంత డబ్బు ఎలా వచ్చింది..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దీనిపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. రామచంద్రభారతి సంప్రదింపులు చేసినట్లు సమాచారం అందిందని సీపీ చెప్పారు. నందకుమార్, సింహయాజులులు రామచంద్రభారతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమాచారం ఇచ్చారని.. ఫామ్ హౌస్‌లో దాడులు చేశామని రవీంద్ర అన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్‌లో వుంటారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతి నుంచి కూడా ఒక స్వామిజీ ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. వీళ్లంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోందని సీపీ చెప్పారు. ఏమని ప్రలోభాలు పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. డబ్బులు, కాంట్రాక్ట్‌లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందని రవీంద్ర అన్నారు.