మహిళలతో దురుసు ప్రవర్తన: ఎమ్మెల్యేలు మంచిరెడ్డి, బలాలపై కేసులు
బిజెపి మహిళా నేతల ఫిర్యాదుల మేరకు రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అహ్మద్ బలాలాలపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీస్ కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు శాసనసభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదయ్యాయి. తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని బిజెపి మహిళా నేతలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వారిగపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపైన, మజ్లీ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపైనా కేసులు నమోదయ్యాయి.
ఇబ్రహీం పట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారంలో రహదారి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయనను అడ్డుకునేందుకు బిజెపి యాచారం ఎంపీపీ సుకన్య ప్రయత్నించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించలేదని ఆమె విమర్శించారు.
ఆ తరుణంలో ఎమ్మెల్యే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డికి సహకరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐలపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో మజ్లీస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారంటూ బిజెపి నాయకురాలు బంగారు శ్రుతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాదర్ ఘాటన్ పరిధిలో ఎస్సీ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను అక్కడికి వెళ్లానని ఆమె చెప్పారు.
ఆ సమయంలో అక్కడ ఉన్న బలాల తనను కించపరిచేలా మాట్లాడారని శ్రుతి ఫిర్యాదు చేశారు. శ్రుతి ఫిర్యాదు మేరకు పోలీసులు బాలాలాపై కేసు నమోదు చేశారు.