నిజామాబాద్ లో ఏటీఎం లూటీ... కొట్టేసిన కారులో వచ్చి దోపిడీ..
ఏటీఎం లూటీ చేయడానికి ప్లాన్ వేసిన దొంగలు.. దొరకకుండా ఉండడం కోసం పక్కా పథకం పన్నారు. ముందు కారు దొంగిలించి అందులోనే వెళ్లి, డబ్బులు దోచుకున్నారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఏటీఎం చోరీ జరిగింది. ఈ దొంగతనానికి కొట్టేసిన కారును ఉపయోగించారు దొంగలు. అపహరించిన కారులోనే వచ్చి ఏటీఎంలోని నగదునంతా ఊడ్చుకెళ్లారు. ఏటీఎం లూటీ చేయడం కోసం మొదట గ్యాస్ కట్టర్ తో మిషన్ ను ధ్వంసం చేశారు. పక్కా పథకం ప్రకారం మొదట కారును దొంగిలించి, ఆ తరువాత ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మొండోరా మండలంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... మంగళవారం అర్ధరాత్రి కొంతమంది దొంగలు డిచ్పల్లిలో ఆపి ఉన్న ఒక కారును దొంగతనం చేశారు. ఆ తర్వాత అందులోనే బుధవారం తెల్లవారుజామున దూద్ గాం శివారులోని పోచంపాడు ఎస్బిఐ శాఖ ఏటీఎం దగ్గరికి వచ్చారు.
తెలంగాణలో ఎన్నిక సంఘం పర్యటన.. అక్టోబర్ లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!
ఏటీఎం ఉన్న డోర్ షెట్టర్ ను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేశారు. ఆ తర్వాత లోపలికి ప్రవేశించిన దొంగలు అందులోని సీసీ కెమెరాకు నల్ల రంగు పూశారు. ఆ తర్వాత ఏటీఎంను కూడా గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి ఏటీఎంలో ఉన్న 12 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఆ డబ్బుతో దొంగిలించిన కారులోనే పరారయ్యారు. ఏటీఎంను ధ్వంసం చేసిన సమయంలో నిజామాబాద్ లోని బ్యాంకు ఉద్యోగి రషీద్ కు అలారం మెసేజ్ వచ్చింది.
దీంతో వెంటనే ఏటీఎంలో ఏదో సమస్య ఏర్పడిందని అనుమానించిన అతను పోలీసులు, బ్యాంకు ఉద్యోగులకు సమాచారం అందించాడు. అయితే, పోలీసులు అతని ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకునే లోపే దొంగలు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఏటీఎం దొంగతనానికి గురైందని అర్థమయ్యింది. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ అడిషనల్ డీసీపీ జయరాం, ఆర్మూరు ఏసిపి జగదీష్ చందర్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు పరిశీలించారు. చోరీ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆర్మూరు సిఐ గోవర్ధన్ రెడ్డి మొండోరా ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.