ఆదిలాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎంతో ఛోరీ చేయడం రెగ్యులర్ అనుకున్నారేమో.. ఏకంగా ఏటీఎం మెషీన్ నే ఎత్తుకెళ్లారు. ఆదిలాబాద్ లోని కలెక్టరేట్ చౌరస్తాలో జరిగిన ఈ దొంగతనం జరిగింది. 

నెల మొదటివారం కావడంలో మిషన్ లో 20 లక్షల వరకు క్యాష్ ను పెట్టారు అధికారులు. ఇది గమనించిన దొంగలు ఈ పనికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఈ దొంగల ముఠా మొదట సోనార్ బజార్ లో ఉన్న వైష్ణవి జ్యువెలర్స్ లో ఛోరీకి ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు.. దీంతో  కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న ఏటిఎం మీద వీరి కన్ను పడింది. 

సీసీ టీవీ కెమెరాలు ఉన్నా వాటి కంటికి మొహం కనిపించకుండా ముసుగులు వేసుకుని ఏటీఎం మిషన్ కు తాడు కట్టి దాన్ని బైటికి లాక్కొచ్చి.. టవేరా వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ తరువాత సావర్గమ్ ప్రాంతంలో ఏటీఎం మిషన్ ను ముక్కలు, ముక్కలుగా చేసి క్యాష్ బాక్స్ తీసుకుని పరారయ్యారు. 

నిందితులు అంతర్రాష్ట ముఠా అయి ఉంటారని డీఎస్పీ వెంకటేశ్వరరావు అంటున్నారు. ఇది మామూలు దొంగల కాదని ప్రొఫెషనల్ దొంగల పని అని వారు అంటున్నారు. మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ గ్యాంగుల పనై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.