హైదరాబాద్‌లో, గురువారం 40.8ºC ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత.. శుక్రవారానికి 41.2ºCకి పెరిగింది.
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా heat wave కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పాదరసం స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. కుమురం భీమ్, జగిత్యాల జిల్లాల్లోని కెరమెరి, ఎండపల్లిలో గరిష్టంగా 45.8º C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి రాష్ట్రంలోనే అత్యంత వేడి ఉన్న ప్రాంతాలు. హైదరాబాద్‌లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 40.8 డిగ్రీల సెల్సియస్ ఉండగా, అది శుక్రవారానికి వచ్చేసరికి 41.2 డిగ్రీలకు పెరిగింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, కరీంనగర్, నల్గొండ,పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 41ºC, 25-26ºC డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటూ చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటకే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం ప్రస్తుతం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందనీ, దీని కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు వేడి గాలుల వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక రానున్న వారం రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.. ఆ తర్వాత దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది’’ అని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో విద్యుత్ కోతలు ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పెరుగుతున్నాయి.
ఢిల్లీలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదయ్యింది. శుక్రవారం ఇది దాదాపు 44 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో 45 ఢిగ్రీలకు పైగా పెరిగే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. దేశరాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వచ్చే నెల వారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. రెండో వారం నుంచి ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయని వాతావరణ విభాగం వెల్లడించింది. రాజస్థాన్ లోని అజ్మీర్ గేట్ ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
