కాంగ్రెస్ జోరు బీజేపీ బేజారు.. ఆ రెండు పార్టీలను కేసీఆర్ దెబ్బకొట్టేనా..?
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్టు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రకటించింది. ఇదే క్రమంలో వైఎస్ షర్మిల సైతం తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపించగా, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతికూలంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి.
Telangana Assembly Elections 2023: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార పీఠం దక్కించుకోవడానికి తమ వద్దవున్న అన్ని ఆస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి తమ ముందున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నాయి. గత నెల వరకు కూడా రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పదని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు, పలు అధ్యయనాలు అంచనా వేశాయి. కానీ, ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. కాంగ్రెస్, బీజేపీలన దెబ్బకొట్టే చర్యల్లో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా కనిపించారు. అసమ్మతి స్వరాలను సైతం పెద్దగా లేవనివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆ పార్టీని ఇరకాటంలో పడేసే విధంగా పరిస్థితులు మారుతున్నాయి.
వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ చరిష్మా బీఆర్ఎస్ కు కలిసివచ్చాయి. అయితే, మూడో సారి అంటే దాదాపు ఏ పార్టీకైనా కొంతవరకు ప్రజా వ్యతిరేకత కనిపించడం సాధారణమే. దీనిని అధిగమించడానికి కేసీఆర్.. ఎన్నికల షెడ్యూల్ కు ముందు పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. అయితే, వాటి వల్ల వెనుకబడిన వర్గాల్లోని మెజారిటీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం ప్రజా వ్యతిరేకత మరింతగా పెరిగింది. అందులో చెప్పుకునే వాటిలో దళిత బంధు ఒకటి. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారు, పార్టీ క్యాడర్ వ్యక్తులకు మాత్రమే ప్రయోజనాలు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రైతు రుణమాపీతో చాలా మంది రైతులు లబ్ది పొందినప్పటికీ.. ఇంకా కొంతమందికి రుణమాపీ కాలేదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి ఇందులోనూ పూర్తి స్థాయి ఫలితాలు అందించకపోవడం కూడా బీఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. ఇక రెండు నెలల క్రిత సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మీ పథకంలో కూడా పార్టీ క్యాడర్ ను ముందుంచడం, వాస్తవంగా సాయం అవసరం ఉన్నవారికి ప్రయోజనాలు కల్పించలేదని క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. ఇందులో ఎమ్మెల్యేలు చెప్పిందే ఫైనల్ కావడంతో ఇక్కడ కూడా పార్టీ క్యాడరే ప్రయోజనాలు అందుకుందనేది మరో ఆరోపణ. పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు కారు దిగడం కూడా మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్ కు ఇంతకుముందు అనుకున్న విధంగా అంతతేలికగా గెలుపు లభించదనేది విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.
ఇక కాంగ్రెస్ దూకుడు ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో గెలుపు, అధికార పీఠం దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు, పలు సర్వేల రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే వెలువడిని ముందస్తు పోల్ సర్వేలు సైతం ఎక్కువగా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్నాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత రెండు సార్లు ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్.. వెనక్కి తగ్గకుండా ఎలాగైనా అధికారం దక్కించుకోవడానికి అధికార పార్టీని ఇరుకున పెట్టే వివిధ ప్రాజెక్టుల అంశాలు, కారు దిగుతున్న నేతలు హస్తం గూటికి చేరడంతో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. పక్కరాష్ట్రమైన కర్నాటకలో గెలుపు కూడా ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడం, దానికి దగ్గట్టుగానే ప్రజల నుంచి వస్తున్న స్పందనలు కాంగ్రెస్ కు బలాలుగా మారుతున్నాయి. ఎప్పుడూ అంతర్గత గొడవలతో సతమతమ్యే కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఐక్యతతో ముందుకు సాగుతుండటం కూడా అనుకూలించే అంశంగా ఉంది.
ఇదే సమయంలో గత ఐదు నెలల ముందు వరకు బీఆర్ఎస్ కు పోటీగా నిలిచేది బీజేపీ అనే పరిస్థితులు ఉండేవి. కానీ నేడు కాషాయ పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల వేళ నాయకులు పార్టీని వీడకుండా కాపాడుకోలేని స్థితిలోకి జారుకుంది. ఇప్పటికే బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం బీజేపీ నాయకుల్లో ఎక్కువ మంది అసెంబ్లీకి పోటీ బదులు లోక్ సభకు పోటీ చేయడానికి మొగ్గుచూపడం కాషాయ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. మంచి ఉత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ కుమార్ ను తప్పించడం కూడా కమలంకు ప్రతికూలంగా మారిందనేది ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొంటుండటం గమనార్హం. మొత్తంగా ప్రస్తుతం పోరు బీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్యే ఉంటుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ మూడో స్థానంలోనే ఉంటుందనే విషయాన్ని ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామలు చెబుతున్నాయి.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ దూరంగా ఉండనున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల సైతం ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, కాంగ్రెస్ కు మద్దతును తెలిపారు. ఓట్లు చీల్చే విషయంలో ఈ రెండు పార్టీల నిర్ణయాలు కాంగ్రెస్ కు అనుకూలించే అవకాశముంది. ఇక వామపక్ష పార్టీలు సైతం కాంగ్రెస్ పట్ల అనుకూలంగానే ఉండటం మరో అంశం. అధికార పార్టీ బీఆర్ఎస్ కు మజ్లీస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ముస్లింలు ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు.. అయితే, అధికార వ్యతిరేకతతో బీఆర్ఎస్ కు కాకుండా వారు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. మొత్తనికైతే రాష్ట్ర రాజకీయాలు కాకారేపుతున్నా పోలింగ్ సమయానికి ఎలా మారుతాయో వేచిచూడాలి.. !