Asianet News TeluguAsianet News Telugu

సీపీఐ, సీపీఎంలకు రెండేసీ స్థానాలు: లెఫ్ట్ పార్టీలతో నేడు కాంగ్రెస్ నేతల భేటీ

సీపీఐ, సీపీఎం నేతలతో  కాంగ్రెస్ నేతలు  ఇవాళ సమావేశం కానున్నారు. సీట్ల సర్ధుబాటుపై చర్చించనున్నారు.
 

 Assembly elections: Left parties in talks with Congress for pre-poll alliance in Telangana lns
Author
First Published Oct 22, 2023, 10:03 AM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు  ఆదివారం నాడు చర్చలు జరపనున్నారు. లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ అధినాయకత్వం సూచన మేరకు  స్థానిక  నాయకత్వం  ఇవాళ  సీపీఐ, సీపీఎం నేతలతో  చర్చలు జరపనున్నారు.

సీపీఐ, సీపీఎంలకు  రెండేసీ అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.  కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలను సీపీఐకీ కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది. చెన్నూరుకు బదులుగా  మునుగోడు అసెంబ్లీ స్థానం ఇవ్వాలని సీపీఐ  కోరుతుంది.  ఈ విషయమై  కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించాలని సీపీఐకి చెందిన నల్గొండ జిల్లా నేతలు సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణను కోరారు. చెన్నూరుకు బదులుగా మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని సీపీఐ  నేతలు  పట్టుబడుతున్నారు. 

మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని  సీపీఎంకు కేటాయించేందుకు  కాంగ్రెస్ సానుకూలంగా ఉంది.  అయితే  సీపీఎంకు కేటాయించే  మరో అసెంబ్లీ స్థానం విషయమై  స్పష్టత రాలేదు.  భద్రాచలం, పాలేరు, ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి తమకు కేటాయించాలని సీపీఎం కోరుతుంది.  భద్రాచలం అసెంబ్లీ స్థానంలో  సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్యను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిగా  ప్రకటించింది.  పాలేరు అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కేటాయించేందుకు  కాంగ్రెస్ సుముఖంగా లేదు.  పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. దీంతో పాలేరు అసెంబ్లీ స్థానం కూడ సీపీఎంకు  కాంగ్రెస్ కేటాయించే పరిస్థితి లేదు.

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు  ఓ అసెంబ్లీ స్థానం కేటాయించాలని కాంగ్రెస్ ను సీపీఎం  కోరుతుంది. దీంతో  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ స్థానాన్ని  సీపీఎంకు  కేటాయించేందుకు  కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. ఈ విషయమై  లెఫ్ట్ పార్టీల నేతలతో  కాంగ్రెస్ పార్టీ  నేతలు  ఇవాళ చర్చించనున్నారు.

రెండో విడత అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తును ప్రారంభించింది. టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు  న్యూఢిల్లీకి చేరుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.  దసరా తర్వాత  అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 

తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. లెఫ్ట్, బీఎస్పీ, టీజేఎస్ లతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.  బీఎస్పీ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీచేసేందుకు  సిద్దంగా లేదు. బీఎస్పీ  ఒంటరిగా బరిలోకి దిగుతుంది.  టీజేఎస్ చీఫ్ కోదండరామ్  మూడు రోజుల క్రితం  కరీంనగర్ లో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో  సమావేశమయ్యారు.  తమకు ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని రాహుల్ గాంధీ  కోదండరామ్ ను కోరారు. ఈ విషయమై కోదండరామ్ ఓ స్పష్టతనుఇచ్చే అవకాశం ఉంది. 

also read:సీట్ల సర్ధుబాటుపై చర్చలు: కాంగ్రెస్ తీరుపై లెఫ్ట్ అసంతృప్తి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ఈ నెల  9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.  ఈ ఏడాది నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతుంది.  ఈ ఏడాది డిసెంబర్ 3న  ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios