అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులుఅండగా ఉంటామని ప్రకటించిన జేఏసీ
లక్ష ఉద్యోగాల హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు చేసింది కేవలం పోలీసు శాఖలోనే.
అదీ కూడా చాలా ఆలస్యంగా ప్రకటనలు చేసి అభ్యర్థుల సహనాన్ని పరీక్షించేలా ఏగ్జామ్ పెట్టారు.
కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షల కోసం అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వేలకువేలు ఖర్చు పెట్టి సీరియస్ గా ప్రిపేరయ్యారు. ఎట్టకేలకు చాలా ఆలస్యంగా ఫలితాలు విడుదలయ్యాయి.
కానీ, సీరియస్ గా పరీక్షలకు ప్రిపేర్ అయిన చాలా మంది అభ్యర్థులకు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి.
గత శుక్రవారం విడుదలైన ఫలితాల్లో మొత్తం 11, 613 పోస్టులకు గానూ 10, 442 మంది అభ్యర్థులు ఎన్నికైనట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.
రిజల్ట్స్ వెలువడినప్పటి నుంచి అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమకు కీ ప్రకారం అధిక మార్కులు వచ్చినా ఎందుకు సెలక్ట్ కాలేదో తెలియడం లేదని వాళ్లు వాపోతున్నారు. తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు సెలెక్జ్ అయ్యారని దీని వెనక ఏదో మతలబు ఉందని వారు ఆరోపిస్తున్నారు.
11 వేల పోస్టులకు నియామక ప్రకటన జారీ చేస్తే 10 వేల మందిని మాత్రమే ఎందుకు సెలక్టు చేశారో తెలియడం లేదని దీనిపై కూడా వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు పరీక్షరాసిన అభ్యర్థుల వివరాలు, మార్కులు, కేటగరీ, కటాఫ్ మార్కులు అన్నింటిని బహిరంగపరచాలని అప్పుడే పారదర్శకంగా నియామమకాలు జరిగాయని తెలుస్తుందని అంటున్నారు.
కాగా, ఫిబ్రవరి 20 న అన్ని వివరాలు ప్రకటిస్తామని పోలీస్ నియామక బోర్డు ఇప్పటికే వెల్లడించింది.

మరోవైపు ఈ విషయంపై తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా స్పందించింది. పోలీసులు నియామక ఫలితాలు వెలువడినప్పటి నుంచి అభ్యర్థుల నుంచి తమకు కూడా అనేక వినతులు
వస్తున్నాయని, ఫలితాలపై అనుమానాలువ్యక్తం చేస్తూ అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారని ప్రకటించింది.
