ఫలితాలపై వస్తున్న ఊహాగానాలన్నీ అర్థరహితమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తుది ఫలితాలు వెలువడే వరకు వేచి ఉండాలని ఆయన అన్నారు. ప్రజాకూటమిలోకి రావాలని కాంగ్రెస్‌ ఆహ్వానించడంపై ఇప్పుడేమీ మాట్లాడలేనని అన్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పూర్తి మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందనపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వివిధ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, స్పందిస్తున్న తీరు చూస్తే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ తప్పదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఫలితాలపై వస్తున్న ఊహాగానాలన్నీ అర్థరహితమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తుది ఫలితాలు వెలువడే వరకు వేచి ఉండాలని ఆయన అన్నారు. ప్రజాకూటమిలోకి రావాలని కాంగ్రెస్‌ ఆహ్వానించడంపై ఇప్పుడేమీ మాట్లాడలేనని అన్నారు. ఈ ఎన్నికల్లో మజ్లీస్ టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

లగడపాటి రాజగోపాల్ సర్వే తప్ప మిగతా ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ టీఆర్‌ఎస్‌ దే విజయమని చెప్పినప్పటికీ హంగ్‌ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలకమవుతుందని బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యానించారు. మజ్లీస్ ను పక్కనబెడితే టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడానికి తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. 

ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మజ్లీస్ పునరాలోచన చేయాలని కాంగ్రెసు సూచించింది. అయితే టీఆర్‌ఎస్‌ మాత్రం తమ దోస్తీ మజ్లిస్‌తోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

లక్ష్మణ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి భాను ప్రసాద్ కూడా స్పందించారు. తమకు ఎవరి భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఆ అవసరం రాదని ఆయన అన్నారు. స్పష్టమైన మెజార్టీతో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.