హైదరాబాద్: ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా తాము భావసారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. 

బుధవారం నాడు యునైటెడ్ ముస్లిం ఫోరం నేతలు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో  సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు  ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఏఏ, ఎన్ఆర్‌సీ గురించి చర్చించారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీని వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓవైసీ కోరారు. ఎన్‌పీఆర్‌కు ఎన్ఆర్‌సీకి మధ్య చాలా తేడా ఉందని ఆయన తెలిపారు. మత ప్రాతిపదికనే మోడీ చట్టం తెచ్చారని ఓవైసీ ఆరోపించారు. ఈ విషయమై తాము భావసారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని  ఆయన చెప్పారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీ అమలు చేయడం వల్ల ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై భవిష్యత్తులో ఏ రకమైన పోరాటం చేయాలనే విషయమై అసదుద్దీన్ ఓవైసీతో కేసీఆర్ చర్చించారు. పలు విషయాలపై  ఈ సందర్భంగా చర్చించారు.పార్లమెంట్‌లో సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు చేసింది. 

ఈ విషయంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనే విషయమై సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.