ఉమ్మడి పౌరస్మృతితో ముస్లింలే కాదు.. హిందువులూ వారి అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బహుళత్వ సమాజం ఉన్న మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతితో నష్టమేనని వివరించారు.  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ జరుగుతున్నది. కొందరు దీన్ని సమర్థిస్తుండగా ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఆయన ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ముస్లింలకే కాదు, హిందువులకూ చేటు చేస్తుందని అన్నారు. బహుళత్వ సమాజంగా ఉన్న మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తే ముస్లింలేకాదు.. హిందువులూ వారి అస్తిత్వాన్ని కోల్పోతారని అన్నారు.

క్రిమినల్ చట్టాలు అందరికీ ఒకే తీరులో ఉన్నప్పుడు సివిల్ కోడ్‌తో ముప్పేంటి అనే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ మన దేశంలో అనేక రకాల సముదాయాలు భిన్న సంస్కృతులను కలిగి ఉన్నాయని వివరించారు. ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, గిరిజనులు, ఆదిలాబాద్ గోండులు అని వివరిస్తూ హిందువుల్లోనే అనేక రకాల సంస్కృుతులను ఆచరిస్తారని, ముస్లింలలోనూ ఉన్నారని చెప్పారు.

ఉమ్మడి పౌరస్మృతితో హిందువులూ తమ అస్తిత్వాన్ని నష్టపోతారని అన్నారు. రాజ్యాంగం అమలు చేసే సమయంలో అంబేద్కర్ దీన్ని ఒక ఆప్షన్‌గానే వదిలిపెట్టారని తెలిపారు. యూసీసీ తప్పనిసరేమీ కాదని చెప్పారు. ఎందుకంటే.. ఇప్పటికే రాజ్యాంగంలో సివిల్ కోడ్ ఉన్నదని వివరించారు. ఉదాహరణకు హిందూ సక్సెషన్ యాక్ట్, స్పెషల్ మ్యారేజీ యాక్ట్, జువైనెల్ జస్టిస్ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి, ప్రత్యేకంగా యూసీసీ అవసరం లేదని చెప్పారు.

Also Read: ఆదిలాబాద్‌లో టమాటా లోడ్‌తో వెళ్లుతున్న లారీ బోల్తా.. పోలీసుల కాపలా

అంతేకాదు, ఇప్పటికే ప్రత్యేక హక్కులు, గుర్తింపు కలిగి ఉన్న సముదాయాలు వాటిని కోల్పోవాల్సి వస్తుందని, ఉదాహరణకు ఆదిలాబాద్ గోండులకు ఉన్న హక్కులు, పోర్చుగీసులకు ఉన్న ప్రత్యేక హక్కులు, ఈశాన్య రాష్ట్రాల తెగలకు ఉన్న ప్రత్యేక హక్కులు ఇలా.. వారంతా తమ ప్రత్యేక హక్కులను యూసీసీతో కోల్పోవాల్సి ఉంటుందని చెప్పారు.