బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ కూడా అంతే బాధ్యురాలు: అసదుద్దీన్ ఒవైసీ
బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్.. బీజేపీ,ఆర్ఎస్ఎస్‌లతో సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ రెండు పార్టీల పాత్ర సమానంగా ఉంటాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అగ్రనేత కమల్ నాథ్ కామెంట్లపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పై శుక్రవారం ఘాటు విమర్శలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంత బాధ్యత వహించాల్సి ఉంటుందో కాంగ్రెస్ కూడా అంతే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల పాత్రకు కాంగ్రెస్ పాత్ర దగ్గరగా ఉంటుందని వివరించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ అయోధ్య రామ మందిరం గురించి, బాబ్రీ మసీదు గురించి కామెంట్ చేశారు. ఈ కామెంట్ పైనే ఒవైసీ ఉటంకిస్తూ విమర్శలు సంధించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేత కమల్ నాథ్ నేత చేసిన వ్యాఖ్యలను నేను చూశాను. బాబ్రీ మసీదు విధ్వంసంలో కాంగ్రెస్ పాత్ర, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల పాత్రను పోలి ఉంటుంది. బాబ్రీ మసీదు విధ్వంసానికి కాంగ్రెస్ కూడా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని కమల్ నాథ్ వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి’ అని విరుచుకుపడ్డారు.
రామ మందిరాన్ని బీజేపీ తన సొంత ఆస్తిలా భావిస్తున్నదని, రామ మందిర నిర్మాణం పూర్తిగా బీజేపీ వల్లే సాధ్యమైందన్నట్టుగా వ్యవహరిస్తున్నదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు. అంతేకాదు, రామ మందిరం సాకారం కావడంలో రాజీవ్ గాంధీకి క్రెడిట్ దక్కుతుందని వివరించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ 1986లో వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణలో తాత్కాలిక రామ మందిరం తాళాలను అప్పటి పీఎంగా ఉన్న రాజీవ్ గాంధీ తెరిపించారని కమల్ నాథ్ అన్నారు. తద్వార బాబ్రీ మసీదు ప్రాంగణంలోకి హిందువులు వెళ్లి ప్రార్థన చేసుకోవడానికి వీలు చిక్కిందని తెలిపారు. కానీ, బీజేపీ మాత్రం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూర్తి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నదని వివరించారు.
‘రామ మందిరానికి బీజేపీ క్రెడిట్ తీసుకోరాదు. రామ మందిరం ఏ ఒక్క పార్టీకి చెందదు. బీజేపీ మాత్రం రామ మందిరం వారి ఆస్తిలా భావిస్తారు. రామ మందిరం దేశం మొత్తానికి చెందుతుంది’ అని కమల్ నాథ్ అన్నారు.