భూపాలపల్లి: అతడో ఆర్మీ జవాన్. దేశ రక్షణను చేపడుతూ ప్రజలందరినీ కాపాడే బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని చేస్తున్న అతడు ఓ యువతి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఇంతకాలం ప్రేమించి, శారీరకంగా ఒక్కటైన యువతి పెళ్లి చేసుకోమని అడగడంతో కోపోద్రిక్తుడైన సదరు జవాన్ ఎన్కౌంటర్ చేసి హతమారుస్తానని బెదిరించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి  వెళితే... భూపాలపల్లి జిల్లాలోని టేకుముట్ల గ్రామానికి చెందిన కార్తీక్ భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. ఇతడు తన సమీప బంధువు, రేగొండ మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇలా వీరిద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు బంధువులే కావడంతో పెళ్లికి ఎలాంటి అడ్డు వుండదని బావించి శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. 

read more  వేములవాడలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య (వీడియో)

అయితే ఇటీవల యువతి తనను పెళ్లి చేసుకోవాలని కార్తీన్ ను కోరింది. దీంతో అతడు తన నిజస్వరూపాన్ని బైటపెట్టాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెగేసి చెప్పడమే కాదు మరోసారి ఆ ప్రస్తావన తీసుకువచ్చినా చంపేస్తానంటూ బెదిరించాడు. ''నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని. మరోసారి పెళ్లి పేరెత్తితే నిన్ను కాల్చి చంపేస్తా. జాగ్రత్త'' అంటూ కార్తిక్ బెదిరించాడని బాదిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 

అయితే ఈ బెదిరింపులకు భయపడని యువతి ప్రియుడి ఇంటిముందు మౌనదీక్షకు దిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ తో వివాహం జరక్కుంటే ఆత్మహత్యే శరణ్యమని యువతి వాపోతోంది. ప్రియుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా నిరసన కూడా చేపట్టింది యువతి.