ఆర్మీలో తుపాకీ పట్టాల్సినోడు పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యాడని కంటతడి పెట్టారు సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేశ్ సోదరి. బీఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న రాణి.. సోదరుడి మరణవార్త తెలుసుకుని స్వస్థలానికి చేరుకున్నారు.
అగ్నిపథ్‌కు (agnipath) వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో (secunderabad railway station) శుక్రవారం చోటు చేసుకున్న అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో రాకేశ్ (rakesh) అనే యువకుడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తన సోదరుడి మరణంపై ఆయన సోదరి, బీఎస్ఎఫ్ జవాన్ రాణి కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్ఫూర్తిగా తీసుకుని రాకేశ్ సైన్యంలో చేరాలని, దేశం కోసం సేవ చేయాలని అనుకున్నాడని రాణి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తన తమ్ముడు తీవ్రంగా ఆందోళన చెందాడని చెప్పారు. ఆర్మీలో తుపాకీ పట్టాల్సినోడు పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యాడని కంటతడి పెట్టారు.
మరోవైపు.. దామెర రాకేష్ అంతిమయాత్రలో (rakesh final rites) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం వరంగల్ (warangal) ఎంజీఎం నుంచి మొదలైన రాకేష్ అంతిమయాత్ర.. అతని స్వగ్రామం డబీర్‌పేట వరకు సాగనుంది. అయితే అంతిమయాత్రలో కొన్నిచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. తొలుత రాకేష్ అంతిమయాత్ర సాగుతున్న మార్గంలోని పోచం మైదాన్ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై కొందరు రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ALso Read:వరంగల్ రైల్వే స్టేషన్‌పై దాడికి యత్నం.. రాకేష్ అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత..
బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలకు నిప్పు పెట్టేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు రాకేష్ అంతిమ యాత్ర ముందుకు సాగగా.. వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ వైపు దూసుకెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు. రాకేష్ మృతదేహాన్ని కూడా అటువైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వేస్టేషన్ ముందు కొందరు టైర్లు కాల్చి ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
