సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీస్ కాల్పుల్లో మరణించిన రాకేశ్ అంత్యక్రియలు అతని స్వగ్రామం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటలో అశ్రు నయనాల మధ్య ముగిశాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్ధులు రాకేశ్ అంతిమ యాత్రలో భారీగా పాల్గొన్నారు. 

అగ్నిపథ్ (agnipath) పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో (secunderabad railway station) శుక్రవారం జరిగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్ అనే యువకుడు మరణించిన సంగతి తెలిసిందే. అతని అంత్యక్రియలు శనివారం జరిగాయి. వరంగల్ ఎంజీఎం మార్చురీ నుంచి రాకేష్ అంతిమ యాత్ర సాగింది. దారి పొడవునా అశేష జనవాహిని హాజరై రాకేశ్‌కు నివాళులర్పించారు. 

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సహా ఎమ్మెల్యేలు ఎంపీలు వెంట నడిచారు. అంతేకాదు.. రాకేష్‌ పాడేను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు మోశారు. అంతిమ యాత్రకు మద్దతుగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, బిఎస్పిలు కూడా ర్యాలీగా వచ్చాయి. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో వరంగల్ నగరంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట వైకుంఠధామంలో రాకేష్‌ చితికి తండ్రి కుమారస్వామి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

మరోవైపు.. దామెర రాకేష్ అంతిమయాత్ర‌లో (rakesh final rites) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం వరంగల్ (warangal) ఎంజీఎం నుంచి మొదలైన రాకేష్ అంతిమయాత్ర.. అతని స్వగ్రామం డబీర్‌పేట వరకు సాగనుంది. అయితే అంతిమయాత్రలో కొన్నిచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. తొలుత రాకేష్ అంతిమయాత్ర సాగుతున్న మార్గంలోని పోచం మైదాన్‌ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై కొందరు రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలకు నిప్పు పెట్టేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు రాకేష్ అంతిమ యాత్ర ముందుకు సాగగా.. వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ వైపు దూసుకెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు. రాకేష్ మృతదేహాన్ని కూడా అటువైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వేస్టేషన్ ముందు కొందరు టైర్లు కాల్చి ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.