నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్మూర్ కు చెందిన టీఆర్ఎస్ కీలక నాయకులు కొందరు రాజీనామా ప్రకటన చేసారు.
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (jeevan reddy) కి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆర్మూర్ (armoor) మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ కవిత. ఆమె భర్త యామాద్రి భాస్కర్ తో పాటు మరికొందరు నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడి అప్రజాస్వామికమని... ఇందుకు నిరసనగానే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.
నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులై కనీసం ఒక్కరోజు కూడా గడవకముందే సొంత నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల రాజీనామా జీవన్ రెడ్డికి కాస్త ఇబ్బందిపెట్టే అంశమే. బిజెపి ఎంపీ అర్వింద్ పై దాడికి నిరసనగా రాజీనామా చేయడం జిల్లా అధ్యక్షున్ని మరింత ఇబ్బందిపెట్టే అంశం.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ (TRS), ప్రతిపక్ష బిజెపి (bjp)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొని వుంది. బిజెపి చాపకింద నీరులా తెలంగాణలో వ్యాపిస్తూ బలం పెంచుకుంటుండటంతో ప్రమాదాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ పార్టీని నిలువరించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని కాషాయ పార్టీ కీలక నాయకులను టీఆర్ఎస్ టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం గత మంగళవారం నందిపేట వెళ్తున్న ఎంపీ అర్వింద్ (dharmapuri arvind) ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పసుపు బోర్డు ఎక్కడంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు రైతుల పేరుతో తమను అడ్డుకుని దాడులకు దిగారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇలా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
తనపై జరిగిన దాడి గురించి ధర్మపురి అర్వింద్ (dharmapuri arvind) మాట్లాడుతూ... ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (jeevan reddy), నిజామాబాద్ పోలీస్ కమిషనరే తనపై దాడికి కారణమన్నారు. దాడిలో పాల్గొన్న వారంతా టీఆర్‌ఎస్ నేతలేనని అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తనను నేరుగా ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని ఎంపీ మండిపడ్డారు.
ఇదే సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అర్వింద్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూరు నుండే తాను పోటీ చేసి జీవన్ రెడ్డిని 50 వేల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ముందు దమ్ముంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని అర్వింద్ తెలిపారు. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయని ఆయన జోస్యం చెప్పారు.
ఇలా ఆర్మూర్ నుండి పోటీ చేస్తానని అర్వింద్ సవాల్ చేయడం... ఇదే సమయంలో కొందరు నాయకులు టీఆర్ఎస్ ను వీడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపిలో చేరడానికే ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ కవిత. ఆమె భర్త యామాద్రి భాస్కర్ తో పాటు మరికొందరు నాయకులు టీఆర్ఎస్ ను వీడినట్లు రాజకీయ చర్చ జరుగుతోంది.
