ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశరక్షణలో పాలుపంచుకోవాలనుకున్న ఓ యవకుడు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ యువకుడు అసలు ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు కనీసం ఇంట్లో వాళ్లకి కూడా తెలియదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. సికింద్రాబాద్ మౌలాలీలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ వద్ద సోమవారం టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్స్ ఏర్పాటు చేశారు. ఆర్మీ సెలక్షన్స్‌లో భాగంగా సోమవారం ఉదయం సైనికాధికారులు పరుగు పందెం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వనపర్తికి చెందిన యువకుడు అరవింద్ రోడ్డుపై పరిగెడుతుండగా అతనికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

కాగా.. తమ కుమారుడు ఆర్మీ సెలక్షన్స్ కి వెళ్తున్నట్లుకు తమకు తెలీదని అరవింద్ తల్లిదండ్రులు తెలిపారు. ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి నగరానికి వచ్చాడని వారు చెప్పారు. ఈలోగా తమ కుమారుడు చనిపోయాడనే వార్త వినాల్సి వచ్చిందని వారు కన్నీరుమున్నీరయ్యారు. 

భారత ఆర్మీలో ఎప్పటికైనా చోటు సంపాదించాలనేది తన కొడుకు చిన్నప్పటి కల అని అరవింద్ తండ్రి అంజన్న తెలిపాడు. ఎంతో ప్రాణంగా పెంచుకున్న కొడుకు ఇప్పుడు మాకు లేడు అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

 ఈ ఘటనపై అరవింద్ స్నేహితులు మాట్లాడుతూ.. పరుగు పందెంలో పాల్గొంటున్నప్పుడు.. రోడ్డుపై కరెంటు తీగలు పడి ఉండటాన్ని మాలో ఒకరు గుర్తించారు. అది చెప్పేలోపే.. అరవింద్ ప్రాణాలు కోల్పోయాడు అని తెలిపారు.