హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎపి పోలీసులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఆ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని అనుకుంటోంది.

ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసులను బందోబస్తుకు పిలిపించడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఎపి పోలీసులను తెలంగాణలో బందోబస్తుకు పిలిపించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సోమవారం చెప్పారు.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ఈసీ తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం, ఓటర్లను ప్రలోభపెట్టడంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు బలగాలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించకూడదని ఈసీ నిర్ణయించింది. ఇతర సరిహద్దు రాష్ట్రాల బలగాలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తామని, ఏపీ పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించమని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. అది కూడా తెలుగు రాష్ట్రం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

తెలంగాణ ఎన్నికలకు 70 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి బలగాలను రప్పిస్తామని చెప్పారు. రెండు ఎయిర్‌ అంబులెన్స్‌లు కావాలని కోరామని, ప్రస్తుతానికి ఒకదానికే అనుమతి లభించిందని, దీన్ని ఖమ్మంలో ఉంచుతామని తెలిపారు. 
 
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఇచ్చిన నోటీసుకు టీఆర్‌ఎస్‌ నుంచి సమాధానం రాలేదని రజత్‌కుమార్‌ తెలిపారు. ఆ పార్టీ నేతలకు ఎన్నికల నిబంధనలు తెలుసునని వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం లేదని తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డి రజత్‌కుమార్‌కు వివరణ ఇచ్చారు. వాహనాల తనిఖీలోనూ పక్షపాతం చూపడం లేదని చెప్పారు.