హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ లో గట్టి పోటీ నెలకొని ఉంది. పలువురు ప్రముఖుల వారసులు ఆ పీటంపై కన్నేశారు. వారిలో మంత్రుల బంధువులు కూడా ఉన్నారు. 

మేయర్ పదవి ప్రస్తుతం జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో పలువురు టీఆర్ఎస్ నేతలు తమ కోడళ్లను, కూతుళ్లను పోటీకి దించుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కోడలు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కూతురు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

Also Read: కేసీఆర్ పక్కా వ్యూహం: హైదరాబాద్ మేయర్ సీటు టీఆర్ఎస్ దే.

రాంనగర్ కార్పోరేటర్ వి. శ్రీనివాస రెడ్డి సతీమణి మమతా రెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కూతురు విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి కూతురు, డిప్యూటీ స్పీకర్ టీ. పద్మారావు కోడలు ఆ పదవిని ఆశిస్తున్నారు. 

దివంగత నేత పి. జనార్దర్ రెడ్డి కూతురు విజయ, బొంతు రామ్మోహన్ సతీమణి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోడలు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో తాను గెలిచిన సీటును తన సతీమణికి కేటాయించాలని బొంతు రామ్మోహన్ పార్టీ నాయకత్వాన్ని ఇప్పటికే కోరారు. 

పోటీకి టీడీపీ సై

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గంలోని 39 డివిజన్లలో, హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలోని 43 డివిజన్లలో పోటీ చేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. మొత్తం 82 డివిజన్లకు టీడీపీ పోటీ చేయనుంది. 

ప్రతి డివిజన్ నుంచి ముగ్గురు ఆశావహుల చొప్పున టీడీపీ దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని జిల్లా అధ్యక్షుడు పి. సాయిబాబా స్వీకరించారు. అభ్యర్థుల జాబితా ఖరారుకు పార్టీ నగర కార్యాలయంలో బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతోంది.