హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు పక్కా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. కేవలం 31 డివిజన్లలో విజయం సాధించినా మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని ఆయన రచించినట్లు అర్థమవుతోంది. గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీను నామినేట్ చేయించడం ఇందులో భాగమేనని అంటున్నారు. 

మేయర్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఈసారి జనరల్ మహిళకు ఈ పదవిని కేటాయించారు. జిహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 41 సీట్లు గెలిచినా మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కుతంది. ఎంఐఎం కూడా సహకరిస్తే 31 సీట్లు గెలిచినా సరిపోతుంది. బిజెపికి మేయర్ పీఠం దక్కకుండా కేసీఆర్ పకడ్బందీగా వ్యూహరచన చేసి అమలు చేయనున్నారు. 

ఈసారి వందకు పైగా సీట్లు సాధిస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ప్రమేయం లేకుండానే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెబుతోంది. అయితే, బిజెపి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి నెలకొని ఉంది. 2016లో జరిగిన ఎన్నికల్లో 99 మంది టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు టీఆర్ఎస్ లోచేరారు. దీంతో టీఆర్ఎస్ కార్పోరేటర్ల సంఖ్య 102కు పెరిగింది. 

ఒక వేళ అనూహ్యమైన పరిస్థితి ఏర్పడి సీట్ల సంఖ్య తగ్గినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి టీఆర్ఎస్ ఎక్స్ అఫిసియో సభ్యుల ఓట్లను వాడుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం టీఆర్ఎస్ కు కలిసి వస్తుంది. వీరి సంఖ్య దాదాపు 35 ఉంది. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ఓటుపై మాత్రమే అనుమానాలున్నాయి. ఆయన చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 76 ఓట్లు అవసరం. ఎక్స్ అఫిషియో సభ్యులను కలిపితే టీఆర్ఎస్ 41 సీట్లు గెలుచుకున్నా మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది. మజ్లీస్ కు 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు వీరు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇస్తే 31 డివిజన్లలో గెలిస్తే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి వీలవుతుంది. 

టీఆర్ఎస్ కు మరో మూడు ఎక్స్ అఫిషియో సబ్యులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముగ్గురిని గవర్నర్ శాసనమండలికి నామినేట్ చేశారు. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిహెచ్ఎంసీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ కు మజ్లీస్ తో కలిపి ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య 48కి పెరిగుతుంది. ఇలా అయితే టీఆర్ఎస్ 28 డివిజన్లలో విజయం సాధించినా సరిపోతుంది. 

జిహెచ్ఎంసీ అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యత్వం విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టత కోరుతూ ఆయా సభ్యులకు లేఖలు రాశారు. ఆ వివరాలు అందిన తర్వాత ఎక్స్ అఫిషియో సభ్యులపై పూర్తి స్పష్టత వస్తుంది.